Share News

సీఐ నాగరాజుపై హత్యానేరం కేసు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:00 AM

రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యా దు ఆధారంగా సీఐ నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు.

సీఐ నాగరాజుపై  హత్యానేరం కేసు

  • పనిచేసిన స్టేషన్‌లోనే ఎఫ్‌ఐఆర్‌.. సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో నమోదు

  • కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ దైవప్రసాద్‌

  • తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు

  • కృష్ణలంక స్టేషన్‌లో క్లూస్‌టీమ్‌ పరిశీలన

  • సీసీ కెమెరా హార్డ్‌డి్‌స్కలు స్వాధీనం

  • సీపీతో విచారణాధికారి నరసింహ కిశోర్‌ భేటీ

విజయవాడ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యా దు ఆధారంగా సీఐ నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. నాగరాజుపై క్రైం నం.107/2026తో బీఎన్‌ఎస్‌ 127(4),127(6), 103(1), 238 సెక్షన్లను మోపారు. దానికి ముందు.. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఆయన సోదరుడు నవరంగ్‌, రాధా-రంగా మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను గురువారం రాత్రి పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వారివెంట ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, బోడె ప్రసాద్‌ వెళ్లారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు సీపీ రాజశేఖరబాబుతో వారంతా భేటీ అయ్యారు. కమిషనర్‌ వారినుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే బాధ్యతను ఒక ఏసీపీ, ఒక ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది.


రంగంలోకి దర్యాప్తు అధికారి..

నాగరాజుపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిగా (ఐవో) మహిళా పోలీ్‌సస్టేషన్‌ ఏసీపీ దైవ ప్రసాద్‌ను సీపీ రాజశేఖరబాబు నియమించారు. శుక్రవారం ఆయన కృష్ణలంకలోని సాయికృష్ణ మేనమామ ఇంటికి వెళ్లి తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. సుమారుగా 2గంటలపాటు వారినుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణలంక పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు. సాయికృష్ణను తీసుకువచ్చారా? ఎప్పుడు తీసుకువచ్చారు? మార్కాపురం ఎవరు వెళ్లారు? తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది? అని ఆరా తీశారు. కాగా, పోలీసు కమిషనర్‌ను రాత్రి కలిసి ఫిర్యాదు చేశామని, ఉదయానికల్లా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు కలిగిందని సాయికృష్ణ మేనమామ, పిన్ని కనకదుర్గ చెప్పారు.


స్టేషన్‌లో క్లూస్‌ టీం తనిఖీలు..

సాయికృష్ణను లాక్‌పలో కొట్టి చంపేశారని తల్లి విజయలక్ష్మి బలంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో క్లూస్‌ టీం రంగంలోకి దిగింది. స్టేషన్‌లో ఉన్న రెండు లాక్‌పలను పరిశీలించింది. స్టేషన్‌లోని సీసీ కెమెరాలకు సంబంధించిన ఎన్వీఆర్‌ హార్డ్‌డి్‌స్కను స్వాధీనం చేసుకొని మంగళగిరి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. ఒక పోలీస్‌ బృందం కృష్ణలంక శ్మశానవాటికకు (స్వర్గపురి) వెళ్లింది. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో గతనెల ఎన్ని అనాథ శవాలు వచ్చాయని ఆరా తీసింది. కాగా, సాయికృష్ణ అదృశ్యం ఘటనపై విచారణాధికారిగా నియమితులైన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబుతో భేటీ అయ్యారు.


ఫిర్యాదులో ఏముందంటే...

‘‘గాదె విజయలక్ష్మి అను నేను కృష్ణలంక రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాను. నాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు గాదె సాయికృష్ణ తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. నందిగామ జైలు నుంచి ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాడు. ఆ తర్వాత మార్కాపురం వెళ్లిపోయాడు. పోలీసులు మే నెలలో మార్కాపురం నుంచి నా కుమారుడిని వారెంట్‌ ఉందని చెప్పి తీసుకొచ్చారు. దీంతో కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజును కలిశాను. ఆయన నా ఫోన్‌ తీసుకుని అందులో ఉన్న డేటాను డిలీట్‌ చేశారు. ఆ తర్వాత కిందకు వెళ్లి కూర్చోమని పంపారు. కిందకు వెళ్లి కూర్చున్న తర్వాత పెద్దపెద్ద కేకలు వినిపించడంతో పైకి వెళ్లాను. లాక్‌పలో పెట్టి నాగరాజు నా కుమారుడిని కొట్టారు.’’ అని ఫిర్యాదులో విజయలక్ష్మి పేర్కొన్నారు.


  • సమగ్ర దర్యాప్తు జరపండి

  • ఎన్‌హెచ్చార్సీకి వైసీపీ ఫిర్యాదు

న్యూఢిల్లీ, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతి, క్రాంతికుమార్‌ ఆత్మహత్య ఘటనలపై స్వతంత్ర, నిష్పాక్షికమైన సమగ్ర దర్యాప్తు జరపాలంటూ జాతీయ మానవ హక్కుల సంఘానికి(ఎన్‌హెచ్చార్సీ) వైసీపీ ఎంపీలు గురుమూర్తి, గుమ్మ తనుజారాణి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సుబ్రమణియన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 20 , 2026 | 04:01 AM