నేరం జరిగిన చోటకు నాగరాజును తీసుకెళ్లొచ్చు!
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:34 AM
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. క
క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు అట్రాసిటీ కేసు కింద మార్పు
నేరం జరిగిన చోటకు నాగరాజును తీసుకెళ్లొచ్చు!
సిట్‌కు హైకోర్టు వెసులుబాటు
రేపటి నుంచి 16 వరకు విచారించేందుకు అనుమతి
అంతా వీడియో రికార్డు చేయండి
దర్యాప్తు బృందానికి జడ్జి ఆదేశం
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. కస్టడీలో సీఐ వెల్లడించే వివరాల ఆధారంగా సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఆయన్ను నేరఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. గురువారం (9వ తేదీ) నుంచి 16వ తేదీ వరకు 8 రోజుల పాటు నాగరాజును ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు.. తిరిగి విజయవాడ నుంచి సెంట్రల్ జైలుకు తరలించే పూర్తి ప్రయాణాన్ని వీడియోగ్రఫీ చేయాలని.. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిట్‌కు స్పష్టం చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 17న ఒరిజనల్ వీడియో రికార్డింగ్ మొత్తాన్ని సంబంధిత మేజిస్ట్రేట్‌కు సమర్పించాలని ఆదేశించింది. పోలీసు కస్టడీ సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలో రికార్డయిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్‌ను అదే రోజు మేజిస్ట్రేట్ ముందు ఉంచాలని జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్న కాలంలో నిందితుడికి ప్రాణానికి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారికి, సిట్ సభ్యులకు తేల్చిచెప్పింది.
భారత జాతీయ నినాదమైన ‘సత్యమేవ జయతే’ సమగ్రతను కాపాడడానికి, వాస్తవాలను వెలికితీసేందుకు సిట్ అధికారులు నిష్పాక్షికంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరపాలని పేర్కొంది. ట్రయల్ కోర్టు విధించిన ఇతర నిబంధనలు యథాతథంగా అమల్లో ఉంటాయని తెలిపింది. నిందితుల హక్కులను కాపాడుతూనే, మరోవైపు దర్యాప్తు సంస్థ చట్టబద్ధమైన అధికారాలను పరిరక్షించాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉందని పేర్కొంది. ఈ నేపఽథ్యంలోనే విజయవాడ కోర్టు విధించిన షరతులను పాక్షికంగా సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.