Share News

సీఐ నాగరాజుపై మరో కేసు

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:40 AM

కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై రెండో కేసు నమోదైంది. విజయవాడ ఫకీర్‌గూడేనికి చెందిన సస్పెక్ట్‌ షీటర్‌ పేరిపోగు క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా..

సీఐ నాగరాజుపై మరో కేసు

  • క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు అట్రాసిటీ కేసుగా మార్పు

  • ఫోన్‌ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపేందుకు కోర్టులో పోలీసుల మెమో

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై రెండో కేసు నమోదైంది. విజయవాడ ఫకీర్‌గూడేనికి చెందిన సస్పెక్ట్‌ షీటర్‌ పేరిపోగు క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా పోలీసులు మార్పు చేశారు. ఈ మేరకు విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం మెమో దాఖలు చేశారు. రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యంపై గందరగోళం కొనసాగుతున్న సమయంలో.. క్రాంతికుమార్‌ మే 21న ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. తన మృతికి సీఐ నాగరాజు కారణమంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిపై దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఈ ఘటనపై దర్యాప్తునకు ఉత్తర మండలం ఏసీపీ పి.సత్యానందాన్ని విజయవాడ పోలీసు కమిషనర్‌ నియమించారు. కొద్దిరోజులుగా దీనిపై ఆయన విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తి కావడంతో.. ఆత్మహత్య కింద నమోదైన కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు మార్చారు. అలాగే క్రాంతికుమార్‌ ఫోన్‌ను తండ్రి వెంకటేశ్వరరావు నుంచి దర్యాప్తు అధికారి స్వాధీనం చేసుకున్నారు. దానిని కొద్దిరోజుల క్రితమే విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించారు. ఫోన్‌ను సాంకేతికంగా విశ్లేషించడానికి రీజినల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు.

Updated Date - Jul 08 , 2026 | 04:41 AM