బందోబస్తు సీఐకి గుండెపోటు
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:46 AM
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ (54) గుండెపోటుతో మరణించారు
నున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ అలీ మృతి
స్వర్ణ సచివాలయ ఉద్యోగుల ఆందోళనలో విషాదం
బందోబస్తు విధుల్లో సీఐకి గుండెపోటు
విజయవాడ/పెదవేగి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ (54) గుండెపోటుతో మరణించారు. ఆందోళన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ధర్నాచౌక్, అలంకార్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న అలీకి గుండెలో స్వల్ప నొప్పి వచ్చింది. వెంటనే ఆయన డ్రైవర్‌ను జీపు తీయమని చెప్పి.. సూర్యారావుపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. కాసేపటికి బాగానే ఉందని తిరిగి బందోబస్తుకు వచ్చారు. అలంకార్ సెంటర్‌లో నిలబడిన పది నిమిషాలకు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి జీపులో నగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన స్పృహ కోల్పోయారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్‌కు తరలించారు. సీపీఆర్ చేసినా శరీరంలో కదలిక లేకపోవడంతో.. అలీ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరరాబు, డీసీపీలు నివాళుర్పించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఏలూరుకు తరలించారు. అలీ స్వస్థలం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం. ఆయన తండ్రి మహ్మద్‌వలీ పోస్టుమ్యాన్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. కుమారుడి మరణవార్తతో ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలీ ఆకస్మిక మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలీ 1996లో ఎస్‌ఐగా పోలీసు శాఖలో అడుగుపెట్టారు. ఆయన సర్వీసు ఎక్కువ కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగింది.