Share News

దూసుకొచ్చిన మృత్యువు

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:52 AM

మినీ లారీ మృత్యుశకటంలా మారింది. అదుపుతప్పి.. బైకును, నీళ్ల ట్యాంకరును ఢీకొని జనంపైకి దూసుకొచ్చింది. ముగ్గురి ప్రాణాలను బలిగొంది.

దూసుకొచ్చిన మృత్యువు

  • బైకును ఢీకొని నీళ్ల ట్యాంకరు వద్ద జనంపైకి వచ్చిన మినీ లారీ

  • ముగ్గురి దుర్మరణం, ఆరుగురికి తీవ్రగాయాలు

  • చిత్తూరు జిల్లాలో దారుణం

శాంతిపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): మినీ లారీ మృత్యుశకటంలా మారింది. అదుపుతప్పి.. బైకును, నీళ్ల ట్యాంకరును ఢీకొని జనంపైకి దూసుకొచ్చింది. ముగ్గురి ప్రాణాలను బలిగొంది. చిత్తూరు జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. శాంతిపురం మండలం కడపల్లెలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన నీళ్ల ట్యాంకరు ఆగిఉంది. స్థానికులు నీరు పట్టుకుంటున్నారు. కడపల్లె పంచాయతీ శివపురానికి చెందిన సుందరప్ప, మునివెంకటమ్మ బైకుపై కుప్పం నుంచి వస్తూ.. ఈ ట్యాంకరును కాస్త దాటారు. అంతలోనే పలమనేరు నుంచి కుప్పం వైపు వేగంగా వస్తున్న మినీలారీ అదుపు తప్పి అడ్డదిడ్డంగా రోడ్డుకు ఇటువైపు వచ్చింది. ఎదురుగా వస్తున్న బైకును.. రోడ్డుపక్కన ఉన్న ట్యాంకరును ఢీకొని జనంపైకి వచ్చి ఆగింది. ఈ ఘటనలో బైకుపై వస్తున్న సుందరప్ప(60) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 8మందిని సమీపంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వీరిలో మునివెంకటమ్మ (55), అనంతపురానికి చెందిన సాత్విక్‌ (5) మార్గమధ్యంలోనే మృతి చెందారు. కడపల్లెకు చెందిన మిగతా ఆరుగురు అక్షయ, నందిని, కనకవల్లి, సతీశ్‌, లక్ష్మితో పాటు మినీలారీ డ్రైవర్‌ కుప్పుస్వామి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనం నడపడమే కారణమని చెబుతున్నారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి, రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


నారా భువనేశ్వరి నివాళి

రామకుప్పం మండల పర్యటన ముగించుకుని నారా భువనేశ్వరి రాత్రికి శాంతిపురం మండలం శివపురంలోని ఇంటికి చేరుకున్నారు. అప్పటికే కుప్పం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించి ఇళ్లకు తీసుకొచ్చిన సుందరప్ప, మునివెంకటమ్మ మృతదేహాలను ఆమె సందర్శించారు. నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Jul 28 , 2026 | 05:55 AM