Share News

చంపేస్తానంటూ ముందే తమీమ్‌ వార్నింగ్‌

ABN , Publish Date - May 03 , 2026 | 06:00 AM

చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో రోజు రోజుకు ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. హత్య ఘటనకు 4 రోజుల ముందు పని మీద చిత్తూరు జిల్లా కోర్టుకు వెళ్లిన జగన్‌ను హంతకుడు తమీమ్‌, అతడి బావ మరిది సుభాన్‌ కలిశారు.

చంపేస్తానంటూ ముందే తమీమ్‌ వార్నింగ్‌

  • ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోని రిపోర్టర్‌ జగన్‌

  • హత్యకు ముందు రోజు వీధుల్లో రెక్కీ

చిత్తూరు, మే 2(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ జగన్మోహన్‌రెడ్డి హత్య కేసులో రోజు రోజుకు ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. హత్య ఘటనకు 4 రోజుల ముందు పని మీద చిత్తూరు జిల్లా కోర్టుకు వెళ్లిన జగన్‌ను హంతకుడు తమీమ్‌, అతడి బావ మరిది సుభాన్‌ కలిశారు. సుమారు 20 నిమిషాలు ముగ్గురే మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ‘నిన్ను చంపేస్తాను జగన్‌’ అని తమీమ్‌ వార్నింగ్‌ ఇవ్వగా.. ‘ఇప్పటికైనా ఇల్లీగల్‌ పనులు, సెటిల్‌మెంట్లు మానేసి మనిషిగా బతుకు. నీలాంటి వారిని చాలా మందిని చూశా’ అని జగన్‌ సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని తన జర్నలిస్టు మిత్రుడు మణితో జగన్‌ పంచుకున్నారు. ఆ వార్నింగ్‌ను సీరియస్‌గా తీసుకుని పోలీసులకు చెప్పి ఉంటే హత్య జరిగేది కాదేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతనెల 28న కత్తితో నరికి చంపడానికి ముందు రోజు జగన్‌ వాకింగ్‌ చేసే ప్రాంతాల్లో తమీమ్‌ రెక్కీ చేశాడు. ఏ వీధిలో, ఏ సమయంలో చంపాలనేది అప్పుడే ప్లాన్‌ చేశా డు. నరికిన తర్వాత జగన్‌ రక్తాన్ని చేతిలోకి తీసుకుని మసీదు గోడకు పూశాడు.


హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న జగన్‌ మిత్రుడు ఆరీఫ్‌ ఇంటిలో నుం చి తన భార్యతో కలిసి కేకలు వేస్తున్నా తమీమ్‌ ఖాతరు చేయలేదు. అయితే తమీమ్‌ మీద 2014 నుంచే ఎర్రచందనం కేసులున్నాయి. అప్పటి నుంచే బెంగళూరుకు చెందిన రౌడీషీటర్లతో పరిచయాలున్నాయి. బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో ఓ రౌడీషీటర్‌ను గురువుగా భావించేవాడు. పది రోజుల ముందు వి.కోటకు వచ్చి ఓ వైసీపీ నాయకుడిని కలిసి రూ.లక్ష అప్పు అడిగాడని సమాచారం. కాగా, జగన్‌ కుటుంబ సభ్యులను శనివారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి.. భరోసానిచ్చారు. జగన్‌ భార్య కు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం, ఇద్దరు పిల్లల ఉన్నత చదువులకు ఫీజులు, సీఎంఆర్‌ఎఫ్‌తో పాటు కలెక్టర్‌ ఖాతా నుంచి నిధులు, నిందితుల మీద పీడీ యాక్ట్‌ నమోదు వంటి హామీలను కలెక్టర్‌ ఇచ్చారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం జగన్‌ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.

Updated Date - May 03 , 2026 | 06:00 AM