చీరాల తీరంలో భారీ కోత!
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:10 AM
బాపట్ల జిల్లా చీరాల మండలపరిధిలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం భారీగా కోతకు గురైంది. శనివారం రాత్రి నుంచి అలలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి.
2 కిలోమీటర్ల పొడవునా.. పదడుగుల లోతున..
అప్రమత్తమైన అధికారులు.. పర్యాటకులను వెనక్కి పంపిన వైనం
చీరాల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల మండలపరిధిలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో సముద్రం భారీగా కోతకు గురైంది. శనివారం రాత్రి నుంచి అలలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. అదే సమయంలో పొట్టిసుబ్బయ్యపాలెం కాలువ వద్ద నుంచి కఠారిపాలెం వరకూ సుమారు 2 కిలోమీటర్ల పొడవున, 20మీటర్ల మేర సవుముద్రంలో కోత ఏర్పడింది. తీరానికి అతి సమీపంలో సుమారు పదడుగుల వరకు లోతు ఏర్పడినట్లు గజ ఈతగాళ్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, మెరైన్ సీఐ రమే్‌షబాబు సిబ్బందితో కలిసి హుటాహుటిన తీర ప్రాంతానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను సమ్రుదంలోకి పంపి పరిస్థితిని అంచనా వేశారు. నీటిలో కొంతదూరం వెళ్లాక మోకాలు లోతు నుంచి సడన్‌గా పదడుగులు గోతిలో పడినట్లు దిగబడిపోయే ప్రమాదం ఉన్నట్లు గజ ఈతగాళ్లు గుర్తించారు. దీంతో పర్యాటకులను తీరంలోకి అనుమతించలేదు. వారాంతం కావడంతో ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచి ఎప్పటిలాగే భారీసంఖ్యలో వచ్చిన పర్యాటకులు నిరాశగా వెనుదిరిగారు. కొంతమంది రామాపురం, వాడరేవు, సూర్యలంక ప్రాంతాలకు వెళ్లారు. సముద్రం కోతకు గురైన ప్రాంతంలో మెరైన్, రెవెన్యూ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గస్తీ ఏర్పాటు చేశారు. కోతకు గురైన ప్రాంతాన్ని అఽధికారులు సోమవారం మరోసారి పరిశీలించనున్నారు.