Share News

చింతాడకు 21 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:19 AM

ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌కు శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్‌ విధించింది. మాజీ సీఎం జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల..

చింతాడకు 21 వరకు రిమాండ్‌

  • మహిళా ఎస్సైపై అనుచిత ప్రవర్తన కేసులో అరెస్టు

  • జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నడిపిస్తూ కోర్టుకు

  • కోర్టు ముందు సెల్‌ఫోన్‌లో మాట్లాడటంపై విచారణ

  • మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలతో అంపోలు జైలుకు

శ్రీకాకుళం/క్రైం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌కు శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్‌ విధించింది. మాజీ సీఎం జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల రవికుమార్‌తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై నమోదైన కేసులో ఆయన్ను శనివారం రాత్రి చిలకపాలెం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమదాలవలస డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆదివారం పాతపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడినుంచి ఆయన్ను పోలీసులు నడిపించుకుంటూ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. రవికుమార్‌కు ఈ నెల 21వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్‌ కోర్టు న్యాయాధికారి ఆదేశించారు. కాగా, ఇదే కేసులో వైసీపీ కార్యకర్తలు ఇప్పిలి శశికుమార్‌ (ఏ13), కూసుమంచి హరీశ్‌(ఏ21)ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో ముగ్గురు నిందితులను అంపోలు జైలుకు తరలించారు.


కోర్టు ముందే ఫోన్‌ మాట్లాడుతూ...

కోర్టు ప్రాంగణంలో రవికుమార్‌ను న్యాయవాదుల బృందం, వైసీపీ సానుభూతిపరులు పరామర్శించారు. వారిలో ఒకరి దగ్గర నుంచి సెల్‌ఫోన్‌ తీసుకొని ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆ సమయంలో పోలీసు బృందం అక్కడే ఉంది. ‘ఫర్వాలేదు.. రవికుమార్‌ ఫోన్‌లో మాట్లాడొచ్చు’ అని ఇంటలిజెన్స్‌ విభాగానికి చెందిన పోలీసు సిబ్బంది ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా కోర్టు వద్ద రవికుమార్‌ ఫోన్‌ మాట్లాడటంపై విచారణ జరిపిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 03:21 AM