సుబ్బన్న కోసమే అప్పన్న!
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:18 AM
‘చిన్నప్పన్న 2018 వరకు మాత్రమే నాకు పీఏగా ఉన్నాడు. నేను టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక అతనితో ఎలాంటి సంబంధాలూ లేవు!’... అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదేపదే చెబుతున్నారు. మరి...
నాడు టీటీడీ చైర్మన్‌గా వైవీ
చైర్మన్ ఆఫీసుకు చిన్నబాసుగా అప్పన్న.. ఇతర సేవలు, దర్శనాలూ ఎన్నో?
మీ ‘మనిషి’ కాకుండా ఎలా సాధ్యం?.. వైవీ సుబ్బారెడ్డి బదులిస్తారా?
(తిరుమల/అమరావతి -ఆంధ్రజ్యోతి)
‘చిన్నప్పన్న 2018 వరకు మాత్రమే నాకు పీఏగా ఉన్నాడు. నేను టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక అతనితో ఎలాంటి సంబంధాలూ లేవు!’... అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదేపదే చెబుతున్నారు. మరి... చైర్మన్‌తో ఎలాంటి సంబంధం ‘లేని’ అప్పన్నకు ఒక్క నెలలో ఆరువేలకు పైగా ‘సుపథం’ టికెట్లు ఎలా కేటాయించారు? అవును నిజం! 2021 సెప్టెంబరులో చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి సిఫారసుపై 595 సుపథం టికెట్లు జారీ అయ్యాయి. అదే నెలలో... అప్పన్న సిఫారసు మేరకు ఏకంగా 6433 టికెట్లను టీటీడీ అధికారులు జారీ చేశారు. చైర్మన్‌తో అప్పన్నకు ఎలాంటి బంధం లేకుంటే ఇదెలా సాధ్యం!? ఇది 2021 సెప్టెంబరు నెలలో జారీ చేసిన సుపథం టికెట్ల జాబితా మాత్రమే. ఇంకెన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల టికెట్లు ఇచ్చారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఏం చెబుతున్నా... అప్పుడు మాత్రం కొండపై ఆయన ‘పీఏ’ చిన్నప్పన్న హవా నడిచేది. చిన్నప్పన్న కోరినన్ని దర్శన టికెట్లు పొందారని, స్వామి దర్శన టికెట్లతోనూ దందా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి చైర్మన్ కార్యాలయ సిబ్బంది చిన్నప్పన్న ఫోన్ చేసి చెబితే చాలు... ఇష్టానుసారం టికెట్లను జారీ చేసినట్టు తెలుస్తోంది. వేల సంఖ్యలో దర్శన టికెట్లు పొందుతూ చైర్మన్ కార్యాలయానికి ఆయన చిన్న బాసుగా వ్యవహరించారని సిబ్బంది చెబుతారు.
సొంత మనిషే కదా...
కల్తీ నెయ్యి కుట్ర కేసులో చిన్నప్పన్న పాత్రను ‘సిట్’ వెలికి తీసింది. డెయిరీ నిర్వాహకులతో బేరసారాలు, బెదిరింపులు, ముడుపుల వ్యవహారాలను ఆయన చక్కగా నడిపించారు. చిన్నప్పన్న పాత్ర బయటపడగానే... ‘ఒకప్పుడు నాకు పీఏ. తర్వాత కాదు’ అంటూ వైవీ సుబ్బారెడ్డి కబుర్లు చెబుతున్నారు. ఆయనెవరో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు. పర్సనల్ అసిస్టెంట్, ప్రైవేట్ అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ ఇలా హోదాలు, పేర్ల సంగతి ఎలా ఉన్నా వైవీ సుబ్బారెడ్డికి చిన్నప్పన్న సొంత మనిషి! తన అధికారిక లెటర్ హెడ్‌లో చిన్నప్పన్న ‘కాంటాక్ట్’ నంబర్ పెట్టుకునేంత ‘దగ్గరి’ మనిషి! ప్రతి దశలో ఆయనకు నీడలా ఉండే వ్యక్తి. ‘ముందు సుబ్బన్న, ఆ వెనుకే అప్పన్న’... ఇలాంటి ఫొటోలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని ప్రత్యేక ‘లక్ష్యాల’ కోసమే నాడు చిన్నప్పను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా పంపించారు. కల్తీ నెయ్యికి సంబంధించిన బేరసారాలన్నీ ఢిల్లీ కేంద్రంగానే జరిగాయి. ‘సిట్’ ఈ సంగతులన్నీ తేల్చింది. అయినప్పటికీ... ‘నాకేం సంబంధం లేదు’ అని వైవీ సుబ్బారెడ్డి అటుంటే, ‘మా బాబాయ్ అమాయకుడు’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెనకేసుకొస్తున్నారు.