Share News

అప్పన్న.. సుబ్బన్న ఒకటేనన్నా..!

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:02 AM

కడూరు చిన్నప్పన్న.. 2019-2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చక్రం తిప్పిన పెద్ద మనిషి. ఎక్కడో ఢిల్లీలో ఏపీ భవన్‌ స్పెషల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులో ఉంటూ టీటీడీలో వ్యవహారాలను శాసించారు.

అప్పన్న.. సుబ్బన్న ఒకటేనన్నా..!

  • ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్‌హెడ్‌పై పీఏ చిన్నప్పన్న ఫోన్‌ నంబర్‌

  • ఇదే నంబర్‌తో చిన్నప్పన్న ‘వ్యవహారాలు’

  • నాడు వైవీ పీఏగా టీటీడీలో చక్రం

  • నెయ్యి టెండర్లలో కీలక పాత్ర

  • కమీషన్లు ఇవ్వకుంటే డెయిరీలు అవుట్‌

  • బేరాలకు ఓకే అన్నవాటికే కాంట్రాక్టులు

  • భారీగా ముడుపులు వసూలు

  • ఢిల్లీలో ఏపీభవన్‌ అధికారిగానూ చిన్నప్పన్న

  • అజేయ కల్లంరెడ్డి సిఫారసుతో పోస్టింగ్‌

  • కల్తీ నెయ్యి దందాలో ఖాతాలోకి 4.6 కోట్లు

  • పెద్దల అండదండలు లేకుంటే సాధ్యమా?

వైసీపీ ఎంపీ, గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కడూరు చిన్నప్పన్న పీఏ మాత్రమే కాదు. అంతకుమించి వీరి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎంపీగా వైవీ త న లెటర్‌హెడ్‌పై చిన్నప్పన్న ఫోన్‌ నంబర్‌ (9542419999) వేయించారు. వైవీ పీఏ హోదాలో చిన్నప్పన్న ఈ ఫోన్‌ నంబర్‌ ద్వారానే టీటీడీలో నెయ్యి టెండర్ల వ్యవహారంలో ‘సంప్రదింపులు’ జరిపారు. పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల ముడుపులు వసూలు చేశారు. సిట్‌ లెక్క ప్రకారం చిన్నప్పన్న ఖాతాలో రూ.4.6 కోట్లు పడ్డాయి.

గత జగన్‌ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. 2019 అక్టోబరు 10 నుంచి 2024 జూన్‌ 1 వరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌ ప్రత్యేక లైజనింగ్‌ అధికారిగా చిన్నప్పన్న పనిచేశారు. 2019 తర్వాత చిన్నప్పన్నతో తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కానీ ఈ మాట పూర్తిగా అవాస్తవం. టీటీడీ చైర్మన్‌గా వైవీ నియమితులైనప్పటి నుంచి చిన్నప్పన్న పీఏగానే వ్యవహరించారని సిట్‌ తుది చార్జిషీట్‌లో స్పష్టం చేసినట్లు తెలిసింది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్‌ అధికారి అయినా పనిచేసినదంతా టీటీడీలోనే.

టీటీడీలో వందల కోట్ల విలువైన నెయ్యి సరఫరా టెండర్లు ఎవరికి దక్కాలో చిన్నప్పన్న డిసైడ్‌ చేశారని సిట్‌ తేల్చింది. అందుకు ప్రతిఫలంగా ముడుపులు అందాయి. పెద్దల అండదండలు లేకుండా ఏపీ భవన్‌లో లైజనింగ్‌ అధికారి హోదాలో ఆయన ఈ దందా చేయగలరా? ఇదే మిస్టరీ? వైవీకి పీఏగా చిన్నప్పన్న పనిచేశారని పేర్కొన్న సిట్‌.. ఈ ‘వ్యవహారం’లో చిన్నప్పన్నను పీఏగా వాడుకున్న వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏమిటో ఎందుకు తేల్చలేకపోయింది?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కడూరు చిన్నప్పన్న.. 2019-2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చక్రం తిప్పిన పెద్ద మనిషి. ఎక్కడో ఢిల్లీలో ఏపీ భవన్‌ స్పెషల్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌ పోస్టులో ఉంటూ టీటీడీలో వ్యవహారాలను శాసించారు. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నుంచి ముక్కుపిండి కమీషన్లు వసూలు చేశారు. అటు ఢిల్లీలో ఎంపీల నివాసాల్లో, ఇటు టీటీడీ పరిధిలో కీలక భేటీలు జరిపి అంతా తానై వ్యవహారాలు చక్కదిద్దారు. ఏపీ భవన్‌లో లైజనింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న చిన్నప్పన్నకు ఇదెలా సాధ్యపడింది? టీటీడీకి, ఆయనకు అసలు సంబంధం ఏంటి? టీటీడీలో ఆయన మాట ఎలా చెల్లుబాటైంది. చిన్నప్పన్న తన పీఏ కాదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన టీటీడీ చైర్మన్‌గా పని చేసినంతకాలం చిన్నప్పన్న పీఏగానే పనిచేశారని సీబీఐ సిట్‌ చెబుతోంది. వైవీ మాటలు వట్టి మాటలేనని నిర్ధారించే ఆధారాలు బయటకొచ్చాయి. చిన్నప్పన్న, సుబ్బన్న ఇద్దరూ ఒకటే అని తేలిపోయింది.


వైవీ లెటర్‌హెడ్‌పై చిన్నప్పన్న నంబర్‌

వైవీ ఎంపీగా తన లెటర్‌హెడ్‌పై ఒంగోలు ఆఫీసు అడ్రస్‌ ఇచ్చారు. కమ్యూనికేషన్‌ కోసం రెండు ఫోన్‌ నంబర్లు ఇవ్వగా, అందులో ఒక నంబర్‌ 9542419999. ఈ నంబరు చిన్నప్పన్నదే. 2019 తర్వాత కూడా అదే కమ్యూనికేషన్‌ కొనసాగింది. ఇదే నంబర్‌ను చిన్నప్పన్న ఉపయోగించి టీటీడీలో టెండర్లు వేసిన కంపెనీలు, సంస్థలతో సంప్రదింపులు, లావాదేవీలు జరిపారు. తిరుమలకు నెయ్యి(కల్తీ) టెండర్ల బాగోతంలో ఢిల్లీ, తిరుపతి, విజయవాడ వేదికగా ఆయన అనేక సమావేశాలు నిర్వహించారు. పలు కంపెనీల నుంచి అటు ఢిల్లీలో, ఇటు తిరుపతి వేదికగా కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేశారు. సిట్‌ లెక్క ప్రకారం 4.6 కోట్ల రూపాయలు చిన్నప్పన్న ఖాతాలో పడ్డాయి. 2019 సెప్టెంబరు వరకే చిన్నప్పన్న తనతో పనిచేశారని, తర్వాత ఆయన ఢిల్లీ ఏపీభవన్‌లో లైజనింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారని, ఆయనతో తనకు ఏ సంబంధం లేదని వైవీ చెబుతున్నారు. అదే నిజమైతే.. 2019 అక్టోబరు నుంచి టీటీడీ వ్యవహారాల్లో చిన్నప్పన్న ఎందుకు వేలుపెట్టారు? చిన్నప్పన్న వైవీ పీఏగానే అందరికీ పరిచయయ్యారు. టీటీడీలోని నాటి కీలక అధికారులు, చివరకు కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ సహా ఇతర ఉన్నతాధికారులు, నిపుణులు చిన్నప్పన్న ఫోన్‌ నంబర్‌ను వైవీ పీఏగానే నమోదు చేసుకున్నారు. సీబీఐ సిట్‌ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది.


అజేయ కల్లంరెడ్డి సిఫారసు

గత జగన్‌ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పనిచేశారు. టీటీడీలో ఎలాగూ తనకు పీఏ, పీఎస్‌, ఇతర అధికారులు ఉంటారు కాబట్టి చిన్నప్పన్నను ఢిల్లీలో ఉంచి ఉపయోగించుకోవాలని వైవీ భావించినట్లుగానే పరిణామాలు జరిగాయి. అందుకే ఆయన్ను ఏపీ భవన్‌లో ప్రత్యేక లైజనింగ్‌ ఆఫీసర్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఇందుకు నాటి సీఎం జగన్‌ ముఖ్య సలహాదారు అయిన అజేయ కల్లంరెడ్డి తోడ్పాటు అందించారని స్పష్టమవుతోంది. చిన్నప్పన్నను ప్రత్యేక లైజనింగ్‌ అధికారిగా నియమించాలని సిఫారసు చేసింది ఆయనే. చిన్నప్పన్నను ఆ పదవిలో నియమిస్తూ గత ప్రభుత్వం 2019 అక్టోబరు 10న ఉత్తర్వులు(జీవో 2234) జారీ చేసింది. తొలుత మూడేళ్లు పోస్టింగ్‌ ఇచ్చారు. తర్వాత మరో రెండేళ్లు పొడిగిస్తూ 2022లో మరో ఉత్తర్వు (జీవో 2076) జారీ చేశారు. అంటే.. 2019 అక్టోబరు 10 నుంచి 2024 జూన్‌ 1 వరకు చిన్నప్పన్న ప్రత్యేక లైజనింగ్‌ అధికారిగా పనిచేశారు.


అసలు లైజనింగ్‌ ఎవరికోసం?

రెండో దఫా పోస్టింగ్‌లో కొనసాగించే సమయంలో.. 2022లో తనను ఏపీ భవన్‌ స్పెషల్‌ సెక్రటరీగా నియమించాలని చిన్నప్పన్న ప్రభుత్వాన్ని కోరారు. అది పెద్ద పోస్టు. కానీ ఆ పదవిలో నియమించలేదు. అయితే ఏపీ భవన్‌లో లైజనింగ్‌ చేయాల్సిన చిన్నప్పన్న ఎవరికోసం పనిచేశారన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం సీబీఐ సిట్‌ చెబుతోంది. టీటీడీ చైర్మన్‌గా సుబ్బారెడ్డి నియమితులైనప్పటి నుంచి చిన్నప్పన్న ఆయన పీఏగానే వ్యవహరించారని తన తుది చార్జిషీట్‌లో అనేక చోట్ల స్పష్టం చేసినట్లు తెలిసింది. టీటీడీ పరిధిలోని అన్ని విభాగాల్లో చిన్నప్పన్న ఫోన్‌ నంబరు వైవీ పీఏగానే నమోదైందని సిట్‌ పేర్కొన్నట్లు సమాచారం. అదే హోదాలో చిన్నప్పన్న టీటీడీలోని కీలక విభాగాధిపతులు, నిపుణులు, ఇతర పెద్దలతో సంప్రదింపులు జరిపారని, తరచూ ఫోన్‌లో మాట్లాడారని సిట్‌ గుర్తించినట్లు తెలిసింది. భోలే బాబా డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే.. తమకు కేజీకి రూ.25 చొప్పున కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది చిన్నప్పన్నే.


ఎంత గట్టి బంధమో?

2022లో భోలే బాబా డెయిరీ కమీషన్‌ ఇచ్చేందుకు నిరాకరించిన తర్వాత దానిపై టీటీడీకి అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఆకాశరామన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అందులో ఒక ఫిర్యాదు నాటి చైర్మన్ సుబ్బారెడ్డికి అందింది. ఆ ఫిర్యాదు మేరకు భోలే బాబా డెయిరీలో తనిఖీలు చేసి విచారణ చేయాలని సుబ్బారెడ్డి ఆదేశించారు. ఇందులో ఒక ట్విస్ట్‌ ఉంది. భోలే బాబా డెయిరీపై వచ్చిన ఒక ఆకాశరామన్న ఫిర్యాదును వైవీ సుబ్బారెడ్డికి అందించింది ఎవరంటే.. చిన్నప్పన్నే. సిట్‌ తన నివేదికలో ఈ విషయం పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన తనిఖీలు, అనంతర వ్యవహారాలకు చిన్నప్పన్న దిశానిర్దేశం చేశారని సిట్‌ స్పష్టంగా చెబుతోంది. తాము కోరినట్లుగా కమీషన్‌లు ఇవ్వని భోలే బాబా డెయిరీని కాంట్రాక్ట్‌ నుంచి తప్పించాలని, ఈ దిశగానే తనిఖీ రిపోర్టులు ఉండాలని టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎంను చిన్నప్పన్న ఫోన్‌లో పదేపదే ఆదేశించారు. ఆ మేరకు జరిగిపోయింది. నాటి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆమోదం లేకుండానే ఇవన్నీ చేశారా? వైవీతో ఏ సంబంధం లేకుండా కేవలం ఏపీ భవన్‌ లైజనింగ్‌ అధికారి ఆదేశిస్తే టీటీ డీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారా?


బేరాల తర్వాతే కాంట్రాక్టులు

నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌ నుంచి భోలే బాబాను తప్పించాక కొత్తగా టెండర్లు ఏ కంపెనీతో వేయించాలన్న విషయంలో కూడా చిన్నప్పన్న పాత్ర ఉంది. పలు కంపెనీలను ఢిల్లీ ఏపీ భవన్‌, ఎంపీల నివాసాల వద్దకు పిలిపించి సమావేశాలు నిర్వహించారు. ఇదే కోవలో ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ ఎండీ జగ్‌మోహన్‌ గుప్తాను పిలిచి మీటింగ్‌ జరిపారు. రూ.483 కోట్ల కాంట్రాక్ట్‌లో కేజీకి రూ.7 చొప్పున కమీషన్‌ ఇవ్వాలని బేరాలు జరిపారు. ఆ తర్వాతే ఆ కంపెనీకి కాంట్రాక్టు దక్కింది. పలు దఫాలుగా చిన్నప్పన్నకు ఆ కంపెనీ డబ్బులు ముట్టజెప్పింది. కాంట్రాక్టులు దక్కించుకున్న ఇతర కంపెనీలు కూడా ఇచ్చాయి.

Updated Date - Feb 09 , 2026 | 06:32 AM