కష్టాల మిర్చి
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:38 PM
ఉమ్మడి జిల్లాలోని ఎండుమిర్చి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి నుంచి గుంటూరుకు ఆతర్వాత చైనా, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతున్న ఎండు మిర్చికి ఆదేశాల నుంచి తిరస్కరణ మొదలైంది.
తగ్గిపోయిన పంట సాగు
పరిమితికి మించి రసాయనాల వినియోగం
విదేశాల నుంచి తిరస్కరణ
వెనక్కి పంపిస్తున్న కంటైనర్లు
ఆందోళనలో రైతులు
అప్లోట్యాక్సిస్ కారణమంటున్న ఉద్యాన శాఖాధికారులు
ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పరిమితికి మించి రసాయనాలు వినియోగించారంటూ చైనా, శ్రీలంక దేశాలు మన మిర్చిని వెనక్కి పంపుతున్నాయి. తెగుళ్లు నివారణ, అధిక ఉత్పత్తి అందుతుందనే ఆశతో రైతులు మిర్చి సాగుకు పెద్దఎత్తున పురుగు మందులను వాడుతుండటంతో ఆయా దేశాల ప్రజలు మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన ఎండుమిర్చిని వినియోగించేందుకు ససేమిరా అంటున్నారు. విదేశాలు ఎండుమిర్చిని తిరస్కరిం చడంతో వ్యాపారులు తక్కువ ధరకు అయితేనే కొనుగోలు చేస్తామని షరతులు పెట్టారని, తెగుళ్ల కారణంగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు పంట సాగును పూర్తిగా తగ్గించేశారు.
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని ఎండుమిర్చి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి నుంచి గుంటూరుకు ఆతర్వాత చైనా, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతున్న ఎండు మిర్చికి ఆదేశాల నుంచి తిరస్కరణ మొదలైంది. తెగుళ్లు నివారణ, అధిక ఉత్పత్తి అందుతుందనే ఆశతో రైతులు మిర్చి సాగుకు పెద్ద ఎత్తున పురుగుమందును వాడుతుండటంతో అక్కడి వారు మన రాష్ట్రం నుంచి ఎగుమితి అయిన ఎండుమిర్చిని వినియోగించేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇటీవే ఉమ్మడి జిల్లాలోని రైతుల నుంచి గుంటూరు వ్యాపారులు కొనుగోలు చేసిన మిర్చిని శ్రీలంకకు ఎగుమతి చేశారు. అక్కడ నాణ్యతను పరిశీలించగా పురుగుమందు అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎండుమిర్చి కంటైనర్లను వెనక్కు పంపారు. అప్లోట్యాక్సీస్‌తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆదేశాల ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయని ఉద్యాన శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఇదే ఏడాది జూనలో ఇక్కటి నుంచి పంపిన మూడు మిర్చి కంటైనర్లను చైనా తిరస్కరించింది. ఇప్పుడు శ్రీలంక పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను వెనక్కు పంపాలని ఆదేశించడంతో మిర్చి వ్యాపారులు శ్రీలం కకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు అధికా రులు తెలిపారు.
నాణ్యత లేదని విదేశాలు..
ఉమ్మడి జిల్లాలో గతంలో మిర్చి సాగు భారీగా ఉండేది. కర్నూలు జిల్లాలో 79వేల హె క్టార్లు, నంద్యాల జిల్లాలో 20వేల హెక్టార్లలో మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. గతంలో నాణ్యతతో పాటు దిగుబడి కూడా ఎక్కువగానే వస్తుండటంతో పెట్టుబడులు పోనూ మంచి ఆదాయం లభించేది. క్రమంగా నాణ్యత లేదని విదేశాలు ఎండుమిర్చిని తిరస్కరిం చడంతో వ్యాపారులు తక్కువ ధరకు అయితేనే కొనుగోలు చేస్తామని షరతులు పెట్టారని, మరో వైపు భారీ వర్షాలు, తెగుళ్ల కారణగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు పంట సాగును పూర్తిగా తగ్గించేశారు.
సుముఖత చూపని రైతులు
కర్నూలు జిల్లాలో ఈ ఏడాది కేవలం 29వేల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 7వేల హెక్టార్లకు మిర్చి సాగు పరిమితమైపోయింది. ధర బాగానే మార్కెట్‌లో ఉంటున్నా భారీగా ఖర్చులు పెరగడం, నాణ్యత పేరుతో విదేశాలు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే మిర్చిని వెనక్కు పంపుతుండటంతో రైతులు మిర్చి సాగుకు సుముఖత వ్యక్తం చేయలేదు. శ్రీలంక దేశంలో ఆ ప్రభుత్వం మన ప్రాంతం నుంచి వెళ్లిన మిర్చి నాణ్యత విషయంలో కఠిన నిబంధనలను అమలు చేయడం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
వ్యాపారులకు నోటీసులిచ్చిన..
చెన్నై పోర్టు ద్వారా శ్రీలంక వెళ్లిన ఎండుమిర్చి కంటైనర్లలో నమూనాలు సేకరించి అక్కడ అధికారులు ప్రయోగశాలలకు పంపిస్తున్నారు. ఆమిర్చిలో అప్లోట్యాక్సిస్ తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో సరుకును వెనక్కు తీసుకెళ్లాలని ఆదేశ ఎస్‌ఎల్‌ఎస్‌ఐ అధికారులు వ్యాపారులకు నోటీసులు ఇచ్చినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు తేమ ఎక్కువై కొన్నింటిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతింటోందని ఆ దేశ అధికారులు చెబుతున్నట్లు వ్యాపారులు వాపోతున్నారు.
రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో..
ప్రజారోగ్యం దృష్ట్యా సరుకులో నాణ్యత తప్పనిసరి విదేశీ అధికారులు మన వ్యాపారులకు స్పష్టం చేశారు. ఒక్కో విడతలో మూడు నాలుగు కంటైనర్ల చొప్పున తిరస్కరణకు గురి కావడం జరిగిందని, ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే పదుల సంఖ్యలో కంటైనర్లు వెనక్కు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వ్యాపారులు తెలిపారు.
అనుకూలించని పరిస్థితులు
సరుకు అక్కడికి వెళ్లాక ల్యాబ్ రిపోర్టు రావడానికి రెండు వారాల సమయం పడుతుంది. తిరస్కరించిన సరుకును ఇండియాకు తెచ్చి మళ్లీ రీప్యాకింగ్ చేసి స్థానికంగానైనా అమ్ము కుందామని ప్రయత్నిస్తున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు. దీని వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఎండుమిర్చి వ్యాపారులు చెబుతున్నారు.
రసాయన మందులు వాడటం తగ్గించాలి:
మిర్చి పంట సాగులో రైతులు భారీగా రసాయన మందులను వినియోగిస్తున్నారు. దీని వల్ల నాణ్యత తగ్గిపోవడంతో పాటు భూములు నిస్సారమై దిగుబడి కూడా తగ్గుతోంది. ఖర్చులు భారీగా పెరగడంతో మిర్చి పంట సాగు ఈ మధ్య కాలంలో భారీగా తగ్గింది. విదేశాలకు ఒకప్పుడు దేశంలోనే అత్యధికంగా మన జిల్లా నుంచి ఎండుమిర్చిని ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం ఈ మిర్చిలో నాణ్యత లేదనే ఉద్దేశంతో చైనా, శ్రీలంక తదితర దేశాల్లో మన మిర్చి కంటైనర్లను వెనక్కు పంపడం మొదలైంది.
ఫ రాజా కృష్ణారెడ్డి, ఉద్యానశాఖ జిల్లా అధికారి, కర్నూలు