Share News

హైరిస్కు పురుగుమందుల వాడకాన్ని నిషేధించండి

ABN , Publish Date - Jun 16 , 2026 | 04:08 AM

మిర్చి సాగులో హైరిస్కు పురుగు మందుల వాడకాన్ని నిషేధించాలని చిల్లీస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఇండియా కోరింది..

హైరిస్కు పురుగుమందుల వాడకాన్ని నిషేధించండి

  • వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌కు మిర్చి ఎగుమతిదారుల సంఘం వినతి

గుంటూరు, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): మిర్చి సాగులో హైరిస్కు పురుగు మందుల వాడకాన్ని నిషేధించాలని చిల్లీస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఇండియా కోరింది. ఇటీవల గుంటూరు మిర్చి ఎగుమతిదారులు చైనా దేశానికి పంపిన మిర్చిలో మూడు కంటైనర్లను అక్కడి కస్టమ్స్‌ అధికారులు తిరస్కరించడంతో సోమవారం అసోసియేషన్‌ నేతలు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఎక్స్‌ అఫిషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ బుడితి రాజశేఖర్‌ను కలిసి మాట్లాడారు. చైనా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎండు మిరపకాయలు ఎగుమతి చేసే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మిర్చి ఆయా దేశాలకు చేరుకోగానే అక్కడి అధికారులు శాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నారని, వాటిల్లో మోతాదుకు మించి మెతామిడోఫాస్‌, ఎసిఫేట్‌, మోనోక్రోటోఫాస్‌, ప్రొఫెనోస్‌, ట్రయాజోపోస్‌, ఇథియాన్‌, క్లోరోపైరిఫోస్‌, ఫిప్రోనిల్‌ వంటి అవశేషాలు బయట పడుతున్నాయన్నారు. దీంతో మిర్చి తిరస్కరణకు గురికావడం, తిరిగి ల్యాబ్‌ టెస్టింగ్‌కు పంపడం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు అనుమతించని, పురుగుమందుల అవశేషాలు ఉన్న మిర్చిని రద్దు చేయాలని కోరారు. రైతులు మిరపసాగులో ఎసిఫేట్‌, మెథామిడోసాస్‌ వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్పెషల్‌ సీఎస్‌ని కలిసిన వారిలో అసోసియేషన్‌ అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ ఉన్నారు.

Updated Date - Jun 16 , 2026 | 04:08 AM