Share News

Chili Prices May Rise: ఈ ఏడాది మిర్చి రైతుకు పండగే!

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:01 AM

రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. అయితే మిర్చి ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మన మిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటి.

Chili Prices May Rise: ఈ ఏడాది మిర్చి రైతుకు పండగే!

  • సాగు తగ్గినా.. ధర పెరిగే అవకాశం

  • 1.08 లక్షల హెక్టార్లలోనే సాగు

  • నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్న సమీక్ష

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. అయితే మిర్చి ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మన మిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటి. ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల వల్ల 10ు మించి ఎగుమతులయ్యే అవకాశం కనిపించడం లేదు. భారత్‌ నుంచి ఏటా 2లక్షల టన్నుల తేజ రకం మిర్చి చైనాకు ఎగుమతి అవుతుండగా, నిరుడు 3 లక్షల టన్నులు ఎగుమతి అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత చైనాకు మిర్చి ఎగుమతులు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు, కర్నూలు, ప్రకాశం జిల్లాలు, అలాగే, అన్నమయ్య, ఎన్టీఆర్‌, నంద్యాల, గుంటూరు, బాపట్ల, ఇతర జిల్లాల్లోనూ మిర్చి సాగవుతోంది. 2024-25లో 1.88లక్షల మంది రైతులు 1.96లక్షల హెక్టార్లలో మిర్చి పండించగా, 2025-26లో లక్షన్నర మంది రైతులు 1.08లక్షల హెక్టార్లలోనే మిర్చి సాగు చేస్తున్నారు. నిరుడు 11.67లక్షల టన్నుల ఉత్పత్తి రాగా, ఈ ఏడాది 5.85 లక్షల టన్నులు మాత్రమే వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది ప్రారంభంలో మిర్చికి మంచి ధరే లభించినా, తర్వాత ధర పతనం కావడంతో సీఎం కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత క్వింటాకు కనీస జోక్యం ధర(ఎంఐపీ) రూ.11,781గా కేంద్రం ప్రకటించింది. అయినా నాణ్యమైన రకాలకు తప్ప.. ఈ ధర అందరికీ దక్కలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో మిర్చి రైతులు, ట్రేడర్లు, ఎగుమతిదారులు, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ధరలపై చర్చించనున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 03:01 AM