మిర్చి, ఆయిల్‌పామ్ ధరలు ఆశాజనకం: అచ్చెన్న
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:57 AM
రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి, ఆయిల్‌పామ్ పంట ఉత్పత్తుల ధరలు ఆశాజనకంగా, రైతులకు లాభసాటిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
నిరుడు జగన్ రైతుల్ని భయపెట్టారని మండిపాటు
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి, ఆయిల్‌పామ్ పంట ఉత్పత్తుల ధరలు ఆశాజనకంగా, రైతులకు లాభసాటిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతేడాది మిర్చి ధర పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంతో మాట్లాడి, మార్కెట్ జోక్యం ధరను ప్రకటించి, ధరలను స్థిరీకరించిందని గుర్తు చేశారు. గురువారం మంత్రి ఒక ప్రకటన చేస్తూ.. గత సీజన్‌లో మిర్చి కామన్ వెరైటీలకు క్వింటా రూ.12,500, స్పెషల్ రకాలకు రూ.13,500 పలకగా, ప్రస్తుతం చాలా రకాలు రూ.15,000 నుంచి రూ.19,500 పలుకుతున్నాయని తెలిపారు. ఆయిల్‌పామ్ టన్నుకు సగటున రూ.19,579 ధర పలుకుతోందన్నారు. గత పదేళ్లలో ఇది అత్యధిక సగటు ధర అని, గత ఏడాది 24,130 హెక్టార్లలో కొత్తగా ఆయిల్‌పామ్ సాగు పెరిగిందని తెలిపారు. మిర్చి రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించడం, కూటమి ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలతో మిర్చి ధర పెరుగుతోందన్నారు. గతేడాది మాజీ సీఎం జగన్.. వ్యతిరేక ప్రకటనలతో రైతుల జీవితాలతో ఆడుకున్నాడని మండిపడ్డారు. ధరలు తగ్గిన వెంటనే రైతులకు భయం కలిగించేలా, మార్కెట్ మరింత పతనమయ్యేలా తప్పుడు ప్రకటనలు చేశారని మండిపడ్డారు.