High Court : వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:24 AM
గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలలో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
సంరక్షించడంలో అధికారులు విఫలం: హైకోర్టు
పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా?
ఆ వివరాలు సమర్పించండి.. హైకోర్టు ఆదేశం
బాలబాలికల మరణాలపై ఆందోళన
హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి.. ఆ నివేదిక ఇవ్వండి
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి,
కమిషనర్‌కు ధర్మాసనం నిర్దేశం
అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలలో ఉంటున్న బాలబాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. వసతి గృహాలలో ఉంటున్న బాలబాలికలను సంరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు జ్వరం, కడుపునొప్పి, కంటి, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లతో మరణించారని చెబుతున్న అధికారులు.. ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో చోటుచేసుకున్న బాలబాలికల మరణాలు, ఏ కారణంతో వారు మరణించారు? అందుకు సంబంధించిన నివేదికలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణించిన బాలబాలికల తల్లిదండ్రులకు పరిహారం చెల్లించే విషయంలో నిర్దిష్ట విధానం ఏమైనా ఉందా? ఇప్పటివరకు ఎవరికైనా పరిహారం చెల్లించారా? పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో క్రమం తప్పకుండా నెలలో ఎన్నిసార్లు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి? హెల్త్ క్యాంపులు ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ రూపొందించి, నివేదికను తమ ముందు ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ వివరాలను వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి దాఖలైన పిల్‌కు జత చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పరిధిలోని హైస్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలబాలికల వసతి గృహాలలో ఏఎన్‌ఎమ్/హెల్త్ వలంటీర్లను నియమించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్‌కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించేలా ఆదేశించాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో బాలబాలికల మరణాలు ఎక్కువయ్యాయన్నారు. వారిని పర్యవేక్షించేందు కు ఏఎన్‌ఎమ్‌లను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. 2016 నుంచి ఇప్పటివరకు వివిధ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో 45 మరణాలు సంభవించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. 2025లో 2 మరణాలు సంభవించాయన్నారు. వివిధ సంక్షేమ హాస్టళ్లలో 2016-25 మధ్య 45 మంది మరణించారని పిటిషనర్ చెబుతున్నారని, ఏ కారణంతో వారు మరణించారు? వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. విచారణ జరిపి నివేదికలు ఇస్తారని, వాటిని కోర్టు ముందు ఉంచుతామన్నారు.