Share News

పాత రికార్డుల కోసం వేధించొద్దు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:22 AM

గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాన్ని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సందర్శించారు.

పాత రికార్డుల కోసం వేధించొద్దు!

  • వివాదాలు లేని భూ సమస్యలను వేగంగా పరిష్కరించండి

  • అధికారులకు సీఎస్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలు

  • గుంటూరులో ‘రెవెన్యూ క్లినిక్‌’ సందర్శన

  • 3 గంటలపాటు అక్కడే ఉండి బాధితుల సమస్యలు, అధికారుల జవాబుల పరిశీలన

గుంటూరు(తూర్పు), జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాన్ని సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సందర్శించారు. దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండి.. వివిధ రకాల భూ సమస్యలపై క్లినిక్‌కు వచ్చే అర్జీలు, వాటి అప్‌లోడ్‌ విధానం, అర్జీలు ఏ అధికారికి వెళ్తాయి, వాటికి అధికారులు ఇచ్చే పరిష్కార మార్గాలు వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణ కుర్చీలోనే ఆయన కూర్చుని అర్జీదారులు తెలిపే సమస్యలు, రెవెన్యూ అధికారులు ఇస్తున్న సమాధానాలను గమనించారు. గుంటూరు జిల్లాలోని 18 మండలాలకు సంబంధించిన కౌంటర్లు, అర్జీలు అప్‌లోడ్‌ కోసం ఏర్పాటు చేసిన నాలుగు కౌంటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ అశుతోష్‌ శ్రీవాత్సవతో కలిసి కొంతమంది బాధితులతో మాట్లాడి అధికారులకు పరిష్కార మార్గాలు సూచించారు. ఈ సందర్భంగా 1900 నాటి భూరికార్డుల కోసం అర్జీదారులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సీఎస్‌ సూచించారు. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామంలో సర్వే నెంబర్‌ 1239లో కొంత రిజిస్టర్‌ భూమిని తొమ్మిది మంది కలిసి కొనుగోలు చేశామని, ఆ తర్వాత వాగు పోరంబోకుగా తేల్చి, 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆ ప్రాంత వాసులు అధికారులకు అర్జీ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసాలను కూడా కూల్చివేస్తున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ భూమి డాక్యుమెంట్లు, 1900 నాటి నుంచి రికార్డులు కావాలని అధికారులు అడగ్గా.. అక్కడే ఉన్న సీఎస్‌ దీనిపై స్పందించారు. ‘పురాతన రికార్డులు వారి దగ్గర ఇప్పుడు ఎలా ఉంటాయి. ఒకవేళ అవి తెస్తే... మొగల్‌ కాలం నాటి రికార్డులు అడుగుతారా?’ అని సిబ్బందికి చురకలు అంటించారు.


వరుస రిజిస్ర్టేషన్లు జరిగిన తర్వాత నిషేధిత జాబితాలో చేర్చడం వెనక వాస్తవాలు నిగ్గు తేల్చి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అంతేగాక ఆ జాబితా నుంచి బయటకు తెచ్చి, మీ భూమిని మీకు అప్పగిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా కొత్తగా తహసీల్దారులుగా బాధ్యతలు తీసుకునే వారు గతంలో ఉన్న భూ సమస్యల కేసులను పూర్తిగా స్టడీ చేయాలని సీఎస్‌ సూచించారు. సర్వే, రీ సర్వే ప్రక్రియలో ప్రైవేటు వ్యక్తులు, అనుభవం లేని వ్యక్తుల జోక్యంపై అప్రమత్తంగా ఉండాలని, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ వివాదాల్లో స్ధానిక మున్సిపాలిటీ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కాగా, సీఎస్‌ కలెక్టరేట్‌కు రావడం, మూడు గంటల పాటు ఉండడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇదే సమయంలో కలెక్టరేట్‌ వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం, కరెంటు కోత వంటి ఘటనలతో మరింత ఆందోళనకు గురయ్యారు.

Updated Date - Jun 09 , 2026 | 05:23 AM