Share News

ఇది రైతు ప్రభుత్వం

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:46 AM

ప్రభుత్వ ఉద్యోగాలపై వైసీపీ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత పాలకులు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని దగా చేశారని..

ఇది రైతు ప్రభుత్వం

  • భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: చంద్రబాబు

  • హద్దురాళ్లపై బొమ్మలేసుకున్న జగన్‌ పిచ్చితనానికి చికిత్స లేదు

  • భూతగాదాలు సృష్టించారు

  • వేల ఎకరాలను 22ఏలో చేర్చారు

  • మేం రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేశాం

  • 1.37 లక్షల ఎకరాల ఇనామ్‌ భూములకు విముక్తి

  • పరీక్షలంటే తెలియనివారు సర్కారుపై బురద జల్లుతున్నారు

  • గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకురారు

  • కోడి కత్తి డ్రామాలాడే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయ్‌?

  • గంజాయి బ్యాచ్‌ను ఓదార్చేవారికి పంటల సాగు ఎలా తెలుస్తుంది?

  • సిద్ధాంతం సభలో సీఎం ఫైర్‌

పరీక్షలంటే తెలియనివారు, పరీక్షలు ఎలా పెట్టాలో తెలియని వారు.. రిజర్వేషన్లంటే తెలియని వారు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. దీనిని యువత గ్రహించాలి.

ఇక రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. వైకుంఠపాళిలో మాదిరిగా ఎత్తుకు ఎదిగి.. మళ్లీ కిందకు పడిపోవడం వద్దు. ప్రజలు గుర్తుంచుకోవాలి.

- సీఎం చంద్రబాబు

భీమవరం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాలపై వైసీపీ నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత పాలకులు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని దగా చేశారని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీతో 16 వేల మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీచేశామని.. జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నామని గుర్తుచేశారు. ‘ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో, ఏం చెప్పాలో తెలియక.. నేరాలు, ఘోరాలు చేసిన వారు వాటిని ఎదుటి వారిపై నెట్టేసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదు. రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి. రాజకీయాలు చేయాలనుకుంటే ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగులను క్షమాపణ అడగాలి. అది చేయకపోతే వారికి ఇక మనుగడ ఉండదు’ అని స్పష్టంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వాసవీ పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో సోమవారం ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. వేదిక వద్దే పాస్‌ పుస్తకాల ముద్రణకు ముందు రెవెన్యూ శాఖ రైతుల నుంచి ఈకేవైసీ చేసిన విఽధానాన్ని తెలుసుకున్నారు. వేదికపై ఇద్దరు రైతులు మామిడిశెట్టి ఏడుకొండలు, పసుమర్తి వెంకటరమణలను చెరోవైపు కూర్చోబెట్టుకున్నారు. కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


జగన్‌ పిచ్చితనానికి చికిత్స లేదు

రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం.. రైతుల కోసం ఎన్నైనా చేస్తాం.. భూవివాదాలకు తావు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నాం.. ‘మీ భూమి-మీ హక్కు’ పేరుతో రైతులకు కచ్చితమైన పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందజేస్తున్నాం. రాష్ట్రంలోని పంట పొలాల్లో గతంలో సైకో జగన్‌ పాగా వేశాడు. భూములు సర్వే చేసి అడంగల్‌ రికార్డుల బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాడు. చివరకు రూ.800 కోట్లు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నాడు. ఇటువంటి పిచ్చితనానికి చికిత్స లేదు. ఎక్కడైనా ఉంటే ఆయనకు ఇప్పించాలి. వివాదాలు లేని గోదావరి జిల్లాల్లో భూసర్వేల పేరుతో సరిహద్దుల తగాదాలు సృష్టించింది ఆయనే.. రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాలను 22ఏలో చేర్చింది జగనే. మేం అఽధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేశాం. భూవివాదాలు పరిష్కరించి భూ హక్కు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26.46 లక్షల పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు మంజూరు చేసి భూసమస్యలకు పరిష్కారం చూపించాం. ఇంకా 67.36 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పాస్‌ పుస్తకాల మంజూరుకు తేదీలను ఖరారు చేశాం. విడతల వారీగా వీటిని అందజేస్తాం. 1.37 లక్షల ఎకరాల ఈనామ్‌ భూములను 22ఏ నుంచి తొలగించాం. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పేరుతో 46 లక్షల మంది రైతులకు రూ.8,965 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే సొమ్ములు జమ చేయాలని ఆదేశించాం. గోనె సంచుల సమస్య లేకుండా చేస్తున్నాం. త్వరలో రేషన్‌లో స్టీమ్‌ బియ్యం సరఫరా చేస్తాం. దీనివల్ల రీసైక్లింగ్‌కు అవకాశం ఉండదు.


ఆక్వా మేత ధరలు తగ్గిస్తాం

అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఆక్వా మేతలకు ఉపయోగించే ముడి సరుకు దిగుమతి కాలేదు. అందువల్ల మేత ధరలు పెరిగాయి. వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ధరలు తగ్గించాలని సంబంధిత మంత్రికి ఆదేశాలు ఇచ్చాం. ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి. యూనిట్‌కు 1.50 పైసలు రాయితీ ఇస్తున్నాం. మరింత మందికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం.

కోటి మందితో యోగాంధ్ర..

ఈ ఏడాది కోటి మందితో యోగాంధ్ర కార్యక్రమం ఈ నెల 21న నిర్వహించనున్నాం. 2047 నాటికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంగా ప్రజలంతా ఉండేందుకే యోగా కూడా ఒక కార్యక్రమంగా చేపడుతున్నాం. సామాన్యులు కూడా చల్లటి వాతావరణంలో ప్రయాణించేలా త్వరలోనే ఎలక్ర్టికల్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తాం. అందులో కూడా మహిళలు ప్రయాణించవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లరేగడి మట్టితో రహదారులు దెబ్బ తింటున్నాయి. భవిష్యత్‌లో ప్రధాన రహదారులన్నీ సిమెంటు రోడ్లలా వేయాలనేది నా కల.

సేవల్లో పశ్చిమ ప్రథమం..

ప్రభుత్వం అందిస్తున్న 53 సేవల్లో పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక సంతృప్తి ఉంది. పెన్షన్‌, రేషన్‌, ధాన్యం కొనుగోలు, యూరియా పంపిణీ, డ్వాక్రా, మెప్మా తదితర శాఖల అధికారులకు అభినందనలు. వెనుకబడిన శాఖల అధికారులు కూడా తీరు మార్చుకుని ముందుకెళ్లాలి.


కబ్జాలు చేస్తామంటే ఊరుకోం..

రాష్ట్రంలో ఇక కబ్జాలకు తావు లేదు. అక్రమాలు, కబ్జాలు చేస్తామంటే ఊరుకోం. ఇక్కడున్నది సీబీఎన్‌ 1995, పవన్‌ కల్యాణ్‌, ప్రధాని మోదీ. అందుకే ఇక్కడ ఆటలు సాగవని తెలంగాణలో చూసుకుంటున్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే తెలంగాణలో కలెక్టర్‌, జేసీ, తహశీల్దార్‌ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.1500 కోట్ల భూమిని కబ్జా చేశారు. అతడిని వైసీపీ నుంచి జగన్‌ ఎందుకు సస్పెండ్‌ చేయలేదు? గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకురారు. కోడి కత్తి డ్రామా ఆడే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి? గంజాయి బ్యాచ్‌ను ఓదార్చే వారికి పంటల సాగు ఎలా తెలుస్తుంది? దేవాలయాలపై దాడులు చేసే వారికి ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయి? కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరిగిందో వారికి తెలుసు. స్వామిని అపవిత్రం చేయాలనుకున్నారు. కల్తీ నెయ్యి వినియోగించి సొమ్ము చేసుకోవడానికి తాపత్రయపడి శిక్ష అనుభవించారు.


రైతులతో ముఖాముఖి

వాసవి పెనుగొండ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సిద్దాంతం వచ్చిన సందర్భంగా గ్రామానికి చెందిన దివాకర శ్రీనివాసులు, నాగలక్ష్మి అనే రైతు కుటుంబంతో సీఎం మాట్లాడారు. వారి పొలాన్ని పరిశీలించారు. గతంలో తమ భూమి ఇనామ్‌ భూమిగా నమోదైన తమకు తెలియదని.. రీ సర్వే ద్వారా సమస్య పరిష్కారమైందని వారు ఆయనకు తెలిపారు. మామిడిశెట్టి సాయి సుబ్రహ్మణ్యం అనే రైతు తన పౌల్ట్రీ వ్యాపారం గురించి సీఎంకు వివరించారు. ఇక రీసర్వేలో సమస్య పరిష్కారం పొందిన రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 2023లో ఇనామ్‌ ఖాతాలో ఫ్రీహోల్డ్‌ భూములుగా మార్చడంతో.. వ్యవసాయ రుణాలు పొందడానికి, విక్రయాలు జరుపుకోవడానికి రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వారు తెలిపారు. రైతులు సీఎంతో చెప్పారు. తర్వాత ఆయన వారికి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందించారు.

Updated Date - Jun 09 , 2026 | 04:49 AM