Share News

AP CM Chandrababu Naidu: విదేశీ విద్యకు గ్యారెంటీ!

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:46 AM

చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి యూనివర్సిటీల్లో...

AP CM Chandrababu Naidu: విదేశీ విద్యకు గ్యారెంటీ!

  • 4శాతం వడ్డీతో విద్యా రుణాలు

  • చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తాం

  • రూ.50 కోట్లతో ఎన్నార్టీల కోసం కార్పస్‌ ఫండ్‌

  • పెట్టుబడుల కోసం మంత్రులకు, నాకు మధ్య పోటీ

  • ఫలితమే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి

  • విద్యుత్తు సంస్కరణలతోనే రాష్ట్రానికి డేటా సెంటర్లు

  • అన్ని రంగాల్లో తెలుగు వారు అభివృద్ధి సాధించాలి

  • అదే నా లక్ష్యం.. అప్పుడే నాకు సంతృప్తి

  • జ్యూరిక్‌లో యూరప్‌ తెలుగు డయాస్పోరా

  • సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

రాష్ట్రంలో వ్యాపారాలకు, పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ప్రవాస తెలుగువారికి (ఎన్నార్టీ) సహకరిస్తాం. వారిని పారిశ్రామికవేత్తలుగా చేయడానికి రూ.50 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నాం. 195 దేశాల్లో తెలుగువారు ఉంటే 148 దేశాల్లో ఎన్నార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మిగిలిన దేశాలకూ విస్తరిస్తాం.

- సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి యూనివర్సిటీల్లో ఎక్కడ చదవాలని విద్యార్థులు కోరుకుంటే అక్కడ అవకాశం కల్పిస్తున్నాం. ప్రభుత్వ గ్యారెంటీతో 4 శాతం వడ్డీతో విద్యారుణాలు ఇప్పించి వారికి విదేశీ విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌లో యూరప్‌ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. దావోస్‌కు తొలిసారి వచ్చినప్పుడు భారతీయులు తక్కువగా ఉండేవారని, తెలుగువాళ్లు అసలే లేరన్నారు. కానీ ఇప్పుడు తెలుగువారు ఉండటమే కాదు, వారిని చూస్తే విజయవాడలో ఉన్నామా.. విశాఖలో ఉన్నామా అనేలా ఉందన్నారు. యూర్‌పలోని 20 దేశాల నుంచి వచ్చిన తెలుగువారిని ఒక్కచోట చూస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. 195 దేశాల్లో తెలుగువారు ఉంటే 148 దేశాల్లో ఎన్నార్టీ (ప్రవాస తెలుగు వారు) వ్యవస్థను ఏర్పాటు చేశామని, మిగిలిన దేశాలకూ విస్తరిస్తామన్నారు. ఏపీలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ పెట్టాం. స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం. వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనేది ప్రభుత్వ విధానం’’ అని వివరించారు.‘‘జన్మభూమిని మర్చిపోతే చరిత్ర హీనులవుతారు. అలాగే కర్మభూమికి సేవలు అందించాలి. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోని స్థానికులతో మమేకం కావడం తెలుగువారి ప్రత్యేకత. ప్రస్తుతం భారతదేశం మినహా అన్ని దేశాల్లోనూ మానవ వనరుల కొరత ఉంది. ఇది మనదేశానికి పెద్ద వరం. ఉద్యోగాలు చేసే వాళ్లుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్లుగా తెలుగు జాతి ఎదగాలి. ముఖ్యంగా ఎన్నార్టీలు (ప్రవాస తెలుగువారు) ఈ దిశగా అడుగులు వేయాలి.’’ అని తెలిపారు.


ఒకరు ఉద్యోగానికి. మరొకరు వ్యాపారానికి..

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే, ఒకరు ఉద్యోగం చేయండి.. మరొకరు వ్యాపారం చేయండి అని చంద్రబాబు సూచించారు. కొత్త తరహాలో ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తలుగా రాణించగలరని, జాతి కోసం, దేశం కోసం స్ఫూర్తితో పనిచేయండని పిలుపునిచ్చారు. ‘‘విజన్‌ 2020, ఐటీ గురించి ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల 195 దేశాలకు తెలుగువారు వెళ్లే అవకాశం లభించింది. 2047కు భారతదేశం ప్రపంచంలో నంబర్‌ వన్‌ ఎకానమీగా అవతరిస్తుంది. దేశానికి అత్యంత బలమైన నాయకత్వం మోదీ రూపంలో ఉంది. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని.. యువకులను పార్టీలో.. ప్రభుత్వంలో ప్రోత్సహిస్తున్నాం. అందుకే రామ్మోహన్‌ నాయుడు, లోకేశ్‌, టీజీ భరత్‌కు పదవులు దక్కాయి. రామ్మోహన్‌ నాయుడు కేంద్రంలో యువ మంత్రి. పదవులంటే గ్లామర్‌ కాదు. రాళ్లు కూడా పడతాయి. వీటిని ఎదుర్కోవడం యువత అలవర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపే కమ్యూనిటీగా తెలుగు వాళ్లు ఎదగాలి. రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నార్టీలు అద్భుతంగా పనిచేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్‌ కల్యాణ్‌ సహకరించారు. అలాగే బీజేపీ కలిసి వచ్చింది. రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలి.. సహకరించాలని ఎన్నార్టీలను కోరితే ఆలోచన చేయకుండా తరలివచ్చారు. రాష్ట్రంలోని నేతలు, కార్యకర్తలతో సమానంగా కొందరు ఎన్నార్టీలు కూడా కేసులు పెట్టించుకున్నారు.’’


22 లక్షల కోట్ల పెట్టుబడులు

‘‘విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్‌ నిర్మించడం సాధ్యమా అని అందరూ ఆందోళన చెందారు. కానీ 18 నెలల కాలంలో బ్రాండ్‌ పునరుద్ధరించాం. పెట్టుబడులు.. అభివృద్ధి విషయంలో మంత్రులు, నేను పోటీ పడుతున్నాం. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. అలాగే దేశానికి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి గూగుల్‌ రూపంలో ఏపీకే వచ్చింది. మిట్టల్‌ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తోంది. కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. ఏఎం గ్రీన్‌ సంస్థ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేసేలా పరిశ్రమలు స్థాపిస్తున్నాం. తక్కువ ఖర్చుతో విద్యుత్తు కొనుగోళ్లు చేపడుతున్నాం. విద్యుత్తు రంగంలో సంస్కరణలు చేపట్టడం వల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నాయి. వివిధ సంస్థలతో మొత్తం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు, వారి ఊళ్లలో ఉన్నవారిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం రాష్ట్రా న్ని మూడు రీజియన్లుగా చేసి అభివృద్ధి చేస్తోంది.’’


‘అడ్వాన్స్‌డ్‌ క్వాంటం’కు అనూహ్య స్పందన

లక్ష మంది నిపుణులు మా లక్ష్యం: సీఎం

అడ్వాన్స్‌డ్‌ క్వాంటం స్కిల్లింగ్‌ కోర్సుకు అనూహ్య స్పందన లభించిందంటూ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కోర్సు నేర్చుకునేందుకు ఇప్పటివరకూ 50,000 మంది నమోదు చేసుకున్నారని ఆయన సోమవారం ఎక్స్‌లో ప్రకటించారు. ‘రాష్ట్రంలో లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారుచేయడం మా లక్ష్యం. అడ్వాన్స్‌డ్‌ క్వాంటం స్కిల్లింగ్‌ కోర్సు నేర్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం ఆనందం కలిగిస్తోంది. ఈ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే నిపుణులను స్వయంగా సత్కరిస్తా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

టెక్నాలజీని అంది పుచ్చుకోవాలి..

‘‘లిక్టన్‌స్ట్రైన్‌ చాలా చిన్న దేశం. కానీ ప్రపంచంలోనే అది అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్లే ఆ దేశం సంపన్న దేశంగా ఎదిగింది. అందుకే నేను క్వాంటమ్‌, ఏఐ, స్పేస్‌, డ్రోన్‌ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాను. ఎలకా్ట్రనిక్స్‌, హెల్త్‌ డివైజెస్‌, ఫార్మా రంగాల అభివృద్ధిపై రాష్ట్రం దృష్టి సారించింది. రాష్ట్రంలో నీటి భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఏఐకి చిరునామాగా భారతీయులు, తెలుగు వాళ్లే ఉన్నారు. ఏపీ ఫస్ట్‌ అనే అతిపెద్ద రీసెర్చి వ్యవస్థను తెస్తున్నాం. ఐఐటీ - ఐఐఎ్‌సఈఆర్‌(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి) కాంబినేషన్‌తో ఈ సెంటర్‌ను తిరుపతిలో స్థాపిస్తున్నాం.’’


గోదావరి పుష్కరాలకు రండి..

ఈ సమావేశంలో కొంత మంది తాము ఎక్కడి నుంచి వచ్చామో తెలియజేస్తూ, బ్యానర్లు ప్రదర్శించారు. వచ్చే ఏడాది నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ సక్సెస్‌ చూపించాలి. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారిని సమన్వయపరిచి, వారిని అభివృద్ధి చేసేలా పారిశ్రామికవేత్తలుగా మార్చే లా లోకేశ్‌, రామ్మోహన్‌నాయుడు, భరత్‌ వంటి వారు బాధ్యత తీసుకోవాలి. 30 ఏళ్లకు ముందు భారతదేశం గురించి ప్రత్యేకంగా చర్చించుకునే వారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది. గోదావరి పుష్కరాలకు రండి’’ అని చంద్రబాబు ఆహ్వానించారు.

తరలివచ్చిన తెలుగు వారు

తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి యూర్‌పలోని 20 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలి వచ్చారు. వారు తమ దేశాల పేర్లను సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఏపీలోని వారి నియోజకవర్గాల పేర్లను ప్రస్తావించినప్పుడు ఎన్నార్టీల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. స్విట్జర్లాండ్‌ తెలుగు అసోసియేషన్‌ నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం తెలుగు కుటుంబాలను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి, ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 06:09 AM