CM Chandrababu Naidu Visit: ప్రాజెక్టుల సందర్శనకు సీఎం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:26 AM
కొత్త ఏడాది మొదటి నెలలో సీఎం చంద్రబాబు వరుసగా సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు.
5న పోలవరం.. 7న వెలిగొండ
17న ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి.. స్వయంగా పనుల పరిశీలన
ఆ ప్రాజెక్టుల వివరాలు పంపాలని జల వనరుల శాఖకు సీఎంవో ఆదేశం
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త ఏడాది మొదటి నెలలో సీఎం చంద్రబాబు వరుసగా సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ నెల 4న విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే.. ఐదో తేదీన పోలవరం వెళ్తారు. ప్రధాన డ్యాం పనుల పురోగతిని పరిశీలిస్తారు. 7వ తేదీన వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి గురువారం తెలిపారు. ఈ నెల 17వ తేదీన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పరిధిలోని పోలవరం ఎడమ కాలువ విస్తరణ పనులను సీఎం పరిశీలించనున్నారు. తన పర్యటనల్లో ఆయా ప్రాజెక్టుల స్థితిగతులను స్వయంగా చూసి.. ఆ వివరాలను ప్రజలకు తెలియజేస్తారు.
గోదావరి పుష్కరాలనాటికి పోలవరం..
పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ను గత నెలాఖరునాటికే పూర్తి చేయాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే.. డిజైన్ల రూపకల్పన, ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంలో జాప్యం.. తదితర కారణాలతో జాప్యం జరిగింది. ఇప్పటికే 83 శాతం డయాఫ్రం వాల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 17 శాతం పనులూ ఫిబ్రవరి నెలాఖరుకు లేదా మార్చి రెండో వారానికి పూర్తి చేస్తామని పోలవరం ఇంజనీరింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ వాల్‌కు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణం కూడా చేపడుతున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పనులు పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు ఆయన సమ్మతించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని జల వనరుల శాఖకు ఇప్పటికే ఆయన గడువు విధించారు. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటన నుంచి రాగానే.. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా తెలుసుకోనున్నారు. గడువులోగా పూర్తిచేస్తామన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించే ఆయన పర్యటన ఉంటుందని జల వనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
పనులు పూర్తవకముందే ప్రారంభోత్సవం..
వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం హోదాలో ప్రాజెక్టును జాతికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యంత ప్రధానమైన పనులు ఇంకా మిగిలి ఉండగానే.. ప్రారంభోత్సవం చేసినట్లు డ్రామాలాడి ప్రజలను జగన్ మోసం చేశారని నిమ్మల ధ్వజమెత్తారు. 7న వెలిగొండ పర్యటన సందర్భంగా అత్యంత కీలకమైన ఫీడర్ చానల్‌కు శంకుస్థాపన చేయడం ద్వారా.. జగన్ చేసిన మోసాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా.. ప్రాజెక్టుల పరిశీలనకు ముఖ్యమంత్రి సిద్ధమవడంతో.. ఇందుకు సంబంధించిన వివరాలను అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) రాష్ట్ర జల వనరుల శాఖను ఆదేశించింది.