కలెక్టర్లకు ర్యాంకులు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:39 AM
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పోటీ
భారీ పెట్టుబడులకు చొరవ తీసుకోవాలి
ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితులను బట్టి ప్రణాళికలు
వేగంగా భూ కేటాయింపులు, అనుమతులు
అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం
అందుకే 3 రీజినల్ అథారిటీల ఏర్పాటు
కలెక్టర్ల సదస్సులో సీఎం దిశా నిర్దేశం
పరిశ్రమలు పెట్టే క్రమంలో స్థానిక ప్రజల్లో అపోహలుంటే వెంటనే కలెక్టర్లు వెళ్లి సమావేశాలు పెట్టాలి. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. డబ్బుల్లేవు.. భూముల్లేవంటే పనులు కావు.. రైతులను, రాజకీయ నాయకులను దారిలోకి తీసుకురండి. అప్పుడే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది.
- ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడటంలో క్రియాశీలంగా పనిచేయాలని సూచించారు. ఈ విషయంలో నిస్తేజాన్ని పోగొట్టేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో కలెక్టర్ల మధ్య పోటీ పెట్టి జిల్లాలవారీగా ర్యాంకులిస్తామని చెప్పారు. రెండో రోజు గురువారం కలెక్టర్ల సదస్సులో పెట్టుబడుల ప్రతిపాదనలపై సీఎం సమీక్షించారు. పెట్టుబడులు వస్తేనే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని అన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితుల ఆధారంగా వివిధ రంగాల్లో పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎకనామిక్ జోన్ల అభివృద్ధికి ప్రణాళికలు
‘రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలను ఆయా ప్రాంతాల వారీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవల్‌పమెంట్ జోన్ల పరిధిలోకి తీసుకువచ్చి అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేశాం. విశాఖపట్నం జోన్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, అమరావతి జోన్‌కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, తిరుపతి జోన్‌కు ఎక్సైజ్ అండ్ మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. ఈ జోన్ల వారీగా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతలను ఈ ముగ్గురు అధికారులకు అప్పగించాం. వీరు కలెక్టర్లతో పెట్టుబడులపై ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ చేసేలా చర్యలు చేపడతారు. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతుల మంజూరు యుద్ధప్రాతిపదికన జరగాలి. అనంతపురం జిల్లా హిందూపురం దగ్గర ఎలకా్ట్రనిక్స్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ అని మాట్లాడుతున్నా కానీ... నేను చెబుతున్న అజెండాను ముందుకు తీసుకువెళ్లడం లేదు. ఆశించినంతగా ఇన్నోవేషన్ రావడం లేదు’ అని సీఎం అన్నారు.
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, జిల్లానూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ‘ప్రజలకు సంక్షేమం, సుపరిపాలన ఇస్తూనే ప్రాంతాల వారీగా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. అభివృద్ధి వికేంద్రీకరణకు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజనల్ డెవల్‌పమెంట్ అథారిటీలు ఏర్పాటు చేశాం. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదు. పరిశ్రమలను జిల్లాకు రప్పించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి’ అన్నారు.
సిస్టమ్ సరైన దారిలో నడవాలి..
‘రాష్ట్రంలో సిస్టమ్ కరెక్టు దారిలో నడవాలి. కలెక్టర్లు అందుకు సలహాలివ్వాలి. ఆర్టీజీఎ్‌సలో ప్రతిసారీ పింఛన్ల పంపిణీలో సృజనాత్మకత తీసుకొస్తున్నారు. దీనిని జిల్లాలవారీగా మెరుగుపరచాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను సరిచేసుకోవాలి. కలెక్టర్లు అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మీ మైండ్ మారాలి. నేను మీకు ఉపన్యాసం ఇవ్వడం లేదు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లా ఓనర్‌షిప్ తీసుకోవాలి. మీలో ఎంత మంది డీఐపీబీ సమావేశాలు పెడుతున్నారు? రెండ్రోజుల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏ జిల్లా ఎక్కుడుందో పరిశ్రమల శాఖ సిద్ధం చేసి, కలెక్టర్లకు పంపించాలి. పరిశ్రమలు రాకపోతే టూరిజం, ఐటీని అభివృద్ధి చేయాలి. నేను కలెక్టర్‌ను, మంత్రిని కాబట్టి అందరూ నా దగ్గరకు రావాలి.. నేను ఇక్కడే ఉంటానన్న దృక్పథం పోవాలి. మీరే వాళ్ల దగ్గరకు వెళ్లాలి.. పోటీతత్వంతో ముందుకు నడవాలి. సానుకూల దృక్పథం ఉంటేనే మీ జిల్లాలకు పరిశ్రమలు వస్తాయి. అప్పుడే మీకున్న ఐఏఎస్ అనే మూడు అక్షరాలకు సార్థకత. లేదంటే రిటైరయ్యే వరకూ ఆ మూడే అక్షరాలు ఉంటాయి. మీ జీవితంలో సంతృప్తి రాదు. కాబట్టి కలెక్టర్లు ఎజెండా ఫిక్స్ చేయాలి.. తర్వాతి కలెక్టర్ల సదస్సు నుంచి ఎన్ని పరిశ్రమలు ఆకర్షించారో మీ పనితీరుపై ప్రజెంటేషన్ ఇవ్వాలి’ అని సీఎం ఆదేశించారు.
ఓర్వకల్లు పారిశ్రామిక క్లస్టర్ ఓ కేస్‌స్టడీ
‘సంపద సృష్టించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే ఎక్కడికక్కడ పరిశ్రమలు రావాలి. అప్పుడే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ఇందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఓ కేస్‌స్టడీ. ఈ ప్రాంతంలో సాగుకు పనికి రాని భూములను పరిశ్రమలకు కేటాయించాం. ఇప్పుడు ఓర్వకల్లు ఇండస్ట్రీస్ హబ్‌గా తయారైంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎయిర్‌పోర్టు వచ్చింది. ఇతర మౌలిక వసతులూ సమకూరాయి. భవిష్యత్తులో ఓర్వకల్లు ఓ మేజర్ పారిశ్రామిక హబ్‌గా మారుతుంది. ఇదేవిధంగా కడప జిల్లా కొప్పర్తి కూడా పెద్ద ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌పగా అభివృద్ధి చెందుతోంది. నంద్యాల జిల్లాలో నీటి వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప అక్కడ సంపద సృష్టించలేం. అన్ని జిల్లాల్లో అగ్రికల్చర్ ఉంది. డ్వాక్రా మహిళలున్నారు. కల్చర్‌ను డెవలప్ చేయాలి. కొన్ని జిల్లాల్లో చాలా సానుకూలతలు ఉన్నాయి. కోస్తా తీరప్రాంతం మనకు అడ్వాంటేజ్. కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి లేదు. అలాంటి జిల్లాల్లోనే మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అగ్రికల్చర్, స్ట్రక్చరల్ డెఫిసెన్సీ్‌సను కరెక్ట్ చేయాలి. ఆయా జిల్లాలకు పరిశ్రమలు రాకపోతే ఐటీని లేదంటే ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేయాలి. ఇలా ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకు ఉన్న ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అక్కడున్న అనుకూల పరిస్థితులను అందిపుచ్చుకుని జిల్లాలను అభివృద్ధి చేయాలి’ అని చంద్రబాబు సూచించారు.
గతంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు
‘గత ప్రభుత్వంలో(2019-24) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఉన్నవాళ్లు భయపడిపోయి పారిపోయారు. అంతకుముం దు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇళ్ల స్థలాలకు, ఇతర అవసరాలకు వాడేశారు. ఇప్పుడు పరిశ్రమలకు భూములు లేవని చేతులెత్తేసి కూర్చుంటే పనులు కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1993 వరకు పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం. 1995 తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి పునాదులు పడ్డాయి. అప్పట్లో ఫార్చూన్ 500 కంపెనీలు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడ్డాయి. అప్పట్లో ఏపీ రావాలని తాను కోరితే హైదరాబాద్ తమ లిస్టులోనే లేదన్నారు. కనీసం కాఫీకైనా రమ్మని ఆహ్వానించాను. వారికి స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు నలుగురు మంత్రులను పంపించాను. పెట్టుబడిదారులు వచ్చిన తర్వాత వారికి సకల మర్యాదలు చేసి, ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చాను. దాంతో వాళ్లు ఆసక్తి చూపించారు. ఆ విధం గా పెట్టుబడులు రావడంతో బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. హైదరాబాద్‌ను ప్రమోట్ చేయడం వల్లే అక్కడికి ఐఎస్‌బీ వచ్చింది. ఇప్పుడు ఆ ఫలితాలను హైదరాబాద్ వాసులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో విభజన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
దిశా... దశా!
సదస్సులో సీఎం సూచనలు
వీటికి ప్రాధాన్యం...
సంక్షేమం
అభివృద్ధి
సూపర్‌సిక్స్ అమలు
సమర్థ నీటి నిర్వహణ
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ప్రజారోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం
స్వచ్ఛ సర్వేక్షణ్
పాలనలో టెక్నాలజీ వినియోగం
ఇలా చేయండి
కలెక్టర్లు నెలలో ఎనిమిది రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి.
హెచ్‌వోడీలు వారం, సెక్రటరీలు నెలకు నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలి.
రాష్ట్ర స్థాయి మాదిరిగానే జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వారంలో రెండుమూడు గంటలు కలెక్టర్ అందులో కూర్చోవాలి.
ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వె్‌స్టమెంట్ ప్రమోషన్ బోర్డు) తరహాలో జిల్లాల్లో కలెక్టర్లు డీఐపీబీలు ఏర్పాటు చేసుకోవాలి.
వినూత్నమైన ఆలోచనలు చేయాలి.
‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’ పాలసీని అమలు చేయాలి.