CM Chandrababu Naidu: స్పీడ్ పెంచాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 04:42 AM
పరిపాలనలో అద్భుత మార్పులు తీసుకొచ్చామని, గాడి తప్పిన రాష్ర్టాన్ని తిరిగి పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
18 నెలల్లో రాష్ర్టాన్ని పట్టాలెక్కించాం: సీఎం
2025లో మనకు మంచే జరిగింది
70 కొత్త పథకాలను అమల్లోకి తెచ్చాం
వచ్చే ఏడాది జూన్‌నాటికి పోలవరం పూర్తి
ఆ తర్వాత సాగునీటిలో ఏపీయే మేటి
ఇతర రాష్ట్రాలకూ నీళ్లిచ్చే స్థితికి చేరతాం
కార్యదర్శులు, హెచ్‌వోడీల సదస్సులో
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పరిపాలనలో అద్భుత మార్పులు తీసుకొచ్చామని, గాడి తప్పిన రాష్ర్టాన్ని తిరిగి పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక స్పీడ్ పెంచాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలకు నిర్దేశించారు. ‘‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేసింది. అయితే 2025లో అంతా మంచే జరిగింది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం’’ అని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. సోమవారం సచివాలయంలో కార్యదర్శులు, హెచ్‌వోడీలతో నేరుగాను, కలెక్టర్లతో వర్చువల్‌గాను ఆయన సమావేశమయ్యారు. అప్పు కూడా చేయలేని పరిస్థితి నుంచి అనేక కొత్త పథకాలు అమలుచేసే స్థితికి చేరుకున్నామన్నారు. ‘‘67లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద రూ.10,090 కోట్లు జమ చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకూ 3.5కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారు. ఇందుకోసం రూ.1,144 కోట్లు ఖర్చు చేశాం. 46లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలుచేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు నగదు జమ చేస్తున్నాం. దీనిపై రైతులు సంతోషంగా ఉన్నారు. ఏడాదికి రూ.33 వేల కోట్ల సామాజిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ దాదాపు 70 కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది’’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
జూన్‌లో భోగాపురం ప్రారంభిస్తాం
‘‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ఏడాది జూన్‌లో అధికారికంగా ప్రారంభిస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అన్నివిధాల తీర్చిదిద్దుతాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేస్తాం.’’
రెవెన్యూ ప్రక్షాళన
‘‘రెవెన్యూ శాఖలో ప్రక్షాళన ప్రారంభించాం. గతంలో పాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటో వేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ రికార్డుల్లోని వివాదాలను పరిష్కరించే పని మొదలుపెట్టాం. రీ సర్వే పూర్తిచేసి వంద శాతం వివాద రహితంగా, పారదర్శకంగా క్యూఆర్ కోడ్‌తో రికార్డులు తీసుకొస్తాం. ఏడాది కాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. భవిష్యత్తులో రిజిస్ర్టేషన్లను ఈ-కేవైసీ ద్వారా చేపడతాం. రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, రీ - సర్వే బాధ్యత మొత్తం జాయింట్ కలెక్టర్లదే. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీయే కీలకం. ఈ విషయంలో రెవెన్యూ సంక్షోభంలో పడింది. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యే పది మంది అధికారులపై చర్య తీసుకుంటే అందరూ జాగ్రత్త పడతారు. ‘మీ పట్టాదారు పాస్ పుస్తకం అందిందా’ అని అడిగితే 22.3 శాతం మంది లేదని చెబుతున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తే చాలా వరకూ సమస్యలు పరిష్కారం అవుతాయి.’’ అని సీఎం అన్నారు. పాస్ పుస్తకాల విషయంలో వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని రెవెన్యూ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ తెలిపారు.
టీటీడీపై దుష్ప్రచారం
దేశంలోని హిందువులంతా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనుకునే తిరుమల పవిత్రతకూ గత ప్రభుత్వం భంగం కలిగించిందని సీఎం మండిపడ్డారు. ‘‘నాడు నెయ్యి కల్తీ చేశారు. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్‌మెంట్ చేశారు. ఇప్పుడు కొత్తగా మద్యం సీసాలను తిరుమలలో పెట్టి టీటీడీ విఫలం అయిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. తీరాచూస్తే అది చేసింది వైసీపీ వారే. ఒకప్పుడు అమరావతిని ఎడారి, శ్మశానం అని అన్నారు. అమరావతి స్ఫూర్తికి విఘాతం కలిగించాలని చూశారు. అక్కడ 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్చంధంగా ఇచ్చారు. భూ సమీకరణలో దేశంలోనే ఇది ఉత్తమ పథకం. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభిస్తాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాదిలో సాగునీరు అంశంలో ఏపీతో మరే రాష్ట్రమూ పోటీపడలేదు. మనమే ఇతర రాష్ర్టాలకు నీరిచ్చే పరిస్థితి వస్తుంది.’’ అని తెలిపారు.
ప్రజలందరికీ వైద్య పరీక్షలు:సీఎం
ఏడాదిలో సంజీవని ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆరోగ్యశాఖపై సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని, మూడు దశల్లో దీనిని పూర్తి చేయాలని నిర్దేశించారు. తొలుత దీర్ఘకాలిక సమస్యలున్న వారికి, తర్వాత విద్యార్థులు, సాధారణ ప్రజలకు పరీక్షలు చేయాలన్నారు. అలాగే, జీ రామ్ జీ పథకంపై కలెక్టర్లు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. ఇందులో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయని తెలిపారు. వ్యవసాయ సీజన్‌లో మాత్రమే పనిదినాలు తగ్గించారని, మిగిలిన సీజన్లలో ఉపాధి ఉంటుందని చెప్పారు. సీ కోస్ట్‌లో గ్రీన్ వాల్ ఏర్పాటు చేయాలని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఇది గ్రేట్ వాల్‌గా మారాలని సీఎం ఆకాంక్షించారు.