Share News

రేపు రాష్ట్రానికి సీజేఐ

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:04 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు.

రేపు రాష్ట్రానికి సీజేఐ

  • రెండు రోజులు పర్యటించనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌

  • తిరుపతి, అమరావతిలో పలు కార్యక్రమాలకు హాజరు

  • జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు గెస్ట్‌హౌస్‌కు శంకుస్థాపన

  • న్యాయమూర్తుల నివాస సముదాయానికి ప్రారంభోత్సవం

  • బెజవాడలో మధ్యవర్తిత్వంపై సింపోజియం

అమరావతి/విజయవాడ/గుంటూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. శనివారం సాయంత్రం ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుపతిలో నిర్మించనున్న 16 కోర్టుల భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి విజయవాడకు వస్తారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజధాని అమరావతికి చేరుకొని ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు గెస్ట్‌హౌ్‌సలకు శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు వద్ద నూతనంగా నిర్మించిన న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే సభలో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం విజయవాడ పటమటలోని అంత్ర లగ్జె కన్వెన్షన్‌ సెంటర్‌లో మధ్యవర్తిత్వంపై నిర్వహించే సదస్సులో సీజైఐ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి దిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. సీజేఐ పర్యటన ఏర్పాట్లపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దక్షిణ భారతంలోనే తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మధ్యవర్తిత్వంపై జరగనున్న సింపోజియంకు సీజేఐతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. అతిథులకు అవసరమైన వసతితోపాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పటిష్ఠ భద్రతపైనా దృష్టిసారించామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు భాగస్వాములు కావాలని కోరారు.

Updated Date - Feb 27 , 2026 | 03:05 AM