Chicken Prices Soar: కొండెక్కిన కోడి
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:26 AM
కోడి మాంసం ధర రికార్డు స్థాయికి చేరింది. విశాఖలో బ్రాయిలర్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంది.
విశాఖలో రికార్డు స్థాయికి ధర
బ్రాయిలర్ స్కిన్‌లెస్ కిలో రూ.300
బెజవాడలో అంతకు మించిన రేటు
కోళ్ల కొరతే కారణం: వ్యాపారులు
మరింత పెరిగే అవకాశం?
విశాఖపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): కోడి మాంసం ధర రికార్డు స్థాయికి చేరింది. విశాఖలో బ్రాయిలర్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే ధర ఉంది. విశాఖలో చికెన్ ధర గతంలో కిలో రూ.290 వరకూ వెళ్లింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి రూ.300కు చేరింది. బెజవాడలో ఇంకా ఎక్కువ ధర ఉంది. కొన్ని దుకాణాల్లో రూ.350కి విక్రయిస్తున్నారు. చాలాకాలంగా బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. ధరలు లేకపోవడం ఇత్యాది కారణాలతో పౌల్ర్టీ రైతులు గతేడాది సెప్టెంబరు నుంచి కోళ్ల పెంపకం తగ్గించారు. కార్పొరేట్ కంపెనీలు కూడా కోళ్ల పెంపకానికి వెనకడుగు వేశాయి. చాలా ఫారాల్లో పూర్తిగా నిలిపివేయగా, మరికొన్ని చోట్ల సామర్థ్యంలో సగం, అంతకంటే తక్కువ మాత్రమే పెంపకం చేపట్టారు. దీంతో ప్రస్తుతం మార్కెట్ డిమాండ్‌కు సరిపడా కోళ్లు లేక ధర పెరిగిపోయింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ దాదాపు అన్ని చోట్ల కొరత ఉంది. శీతాకాలంలో కోడి మూడు నుంచి నాలుగు కిలోల బరువు పెరుగుతుంది. ప్రస్తుతం డిమాండ్ తీవ్రత దృష్ట్యా ఫారాల్లో రెండు నుంచి రెండుంపావు కిలోల బరువు వచ్చేసరికి అమ్మేస్తున్నారు. ఉత్తరాంధ్ర కంటే ఒడిశాలో ధర పది రూపాయలు తక్కువ ఉండటంతో శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు పలువురు వ్యాపారులు ఒడిశా నుంచి కోళ్లు తెస్తున్నారు. అదే సమయంలో విశాఖ జిల్లా నుంచి గోదావరి జిల్లాలకు కోళ్లను రవాణా చేస్తున్నారు. పరిశ్రమ కుదుటపడే వరకు రైతులు, కార్పొరేట్ కంపెనీలు ఆచితూచి కోళ్ల పెంపకం చేపడుతున్నట్టు కోళ్ల వ్యాపారి తాట్రాజు అప్పారావు చెప్పారు. ప్రస్తుతం ధరలు మరికొంత పెరిగే అవకాశం ఉందన్నారు.