చదివేది డిగ్రీ.. చేసేది గంజాయి రవాణా
ABN , Publish Date - May 22 , 2026 | 05:11 AM
బ్రహ్మపుర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలులో విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు సోదాలు నిర్వహించి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
14 కిలోలు రైలులో తరలిస్తుండగా పట్టివేత, ఇద్దరి అరెస్ట్
చీపురుపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): బ్రహ్మపుర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలులో విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు సోదాలు నిర్వహించి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన కొడవలం దేవీనాథ్, ఏదోతా పటమాటు జోసె్‌ఫను అరెస్ట చేశారు. చీపురుపల్లి సీఐ జి.శంకరరావు కథనం మేరకు.. కేరళ రాష్ట్రం కసర్‌గాడ్ జిల్లా కొడవలం గ్రామానికి చెందిన దేవీనాథ్, ఎర్నాకుళం జిల్లా వట్టటుపరకు చెందిన జోసెఫ్ చెడు అలవాట్లకు బానిసలై, తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని బరంపురానికి చెందిన రాహుల్ నుంచి గంజాయి కొనుగోలు చేశారు. ఈ గంజాయిని బ్రహ్మపుర్ నుంచి విశాఖ వెళ్లే పాసింజర్ రైలులో తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. చీపురుపల్లి స్టేషన్‌లో అదే రైలు ఎక్కారు. అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులు తనిఖీ చేయగా 14 గంజాయి బయటపడింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ సైబర్ ఫోరెన్సిక్, కంప్యూటర్ సైన్సు ఫైనలియర్ విద్యార్థులని పోలీసులు తెలిపారు. కాగా.. రైల్లో చీపురుపల్లి పోలీసులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో నార్కోటిక్ డాగ్ రుద్ర గంజాయి తరలిస్తున్న వ్యక్తులను గుర్తించింది. పోలీసులు అప్రమత్తమై నిందితులను అరెస్ట్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నారు.