Share News

ఫ్రీజ్‌ చిక్కులకు చెక్‌!

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:25 AM

- చెన్నైకి చెందిన సందీప్‌ విజయవాడలో ఉన్న స్నేహితుడి విజయ్‌కి ఫోన్‌పే ద్వారా రూ.5వేలు పంపాడు. కొద్దిరోజుల తర్వాత విజయ్‌ బ్యాంక్‌ ఖాతా లావాదేవీలు నిలిచిపోయాయి. సందేహం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశాడు. చెన్నైలోని సైబర్‌ క్రైం పోలీసులు ఈ ఖాతాను స్తంభింపజేశారని సిబ్బంది చెప్పారు. విజయ్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ నేరాలకు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమకావడంతో లావాదేవీలను స్తంభింపజేశారని తెలిపారు. తర్వాత అతడు చెన్నై వెళ్లి పోలీసులను సంప్రదించాడు. సైబర్‌ నేరం ద్వారా జమయిన మొత్తాన్ని చెల్లిస్తే ఎన్‌వోసీ ఇస్తామని, తర్వాత నుంచి ఖాతా ద్వారా లావాదేవీలు చేసుకునే సదుపాయం ఉంటుందని వివరించారు. ఇది విజయ్‌ ఒక్కడే ఎదుర్కొన్న పరిస్థితి కాదు. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఫ్రీజ్‌ చిక్కులకు చెక్‌!

‘ఈ’ నేరాల్లో చిక్కుకున్న బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌లో కొత్త విధానం

ఏ రాష్ట్ర పోలీసులు ఫ్రీజ్‌ చేసినా ‘స్థానిక’ పరిష్కారం

స్థానిక అధికారులు, కేసు నమోదు చేసిన ఐవోలు, బ్యాంక్‌ మేనేజర్లదే నిర్ణయం

సైబర్‌ నేరానికి సంబంధించిన నగదు మాత్రమే సీజ్‌

మిగిలిన నగదు లావాదేవీలకు గ్రీన్‌సిగ్నల్‌

త్వరలో అందుబాటులోకి రానున్న నూతన విధానం

- చెన్నైకి చెందిన సందీప్‌ విజయవాడలో ఉన్న స్నేహితుడి విజయ్‌కి ఫోన్‌పే ద్వారా రూ.5వేలు పంపాడు. కొద్దిరోజుల తర్వాత విజయ్‌ బ్యాంక్‌ ఖాతా లావాదేవీలు నిలిచిపోయాయి. సందేహం వచ్చి బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశాడు. చెన్నైలోని సైబర్‌ క్రైం పోలీసులు ఈ ఖాతాను స్తంభింపజేశారని సిబ్బంది చెప్పారు. విజయ్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్‌ నేరాలకు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమకావడంతో లావాదేవీలను స్తంభింపజేశారని తెలిపారు. తర్వాత అతడు చెన్నై వెళ్లి పోలీసులను సంప్రదించాడు. సైబర్‌ నేరం ద్వారా జమయిన మొత్తాన్ని చెల్లిస్తే ఎన్‌వోసీ ఇస్తామని, తర్వాత నుంచి ఖాతా ద్వారా లావాదేవీలు చేసుకునే సదుపాయం ఉంటుందని వివరించారు. ఇది విజయ్‌ ఒక్కడే ఎదుర్కొన్న పరిస్థితి కాదు. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

పేమెంట్‌ యాప్‌లు అరచేతిలో ఉండడంతో నగదు బదిలీలు చాలా సులువుగా జరిగిపోతున్నాయి. ఈ సులభ మార్గమే కొన్ని చిక్కులు తెచ్చిపెడుతోంది. ‘ఈ’ నేరాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా చిక్కుల్లో పడిన ఖాతాదారులకు త్వరలో ఉపశమనం కలగనుంది. ఖాతాను ఏ రాష్ట్రంలో పోలీసులు స్తంభింపజేసినా స్థానిక సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ ద్వారా పరిష్కారం చేసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. తెలియకుండా జరిగిన లావాదేవీలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సదుపాయం ఉపశమనం కలిగించబోతోంది.

స్థానికంగానే పరిష్కారం

సైబర్‌ నేరాల్లో బాధితుల సొమ్ము జమయిన ఖాతాలను సైబర్‌ పోలీసులు స్తంభింపజేస్తారు. ఖాతాలు ఒక చోట ఉంటే, దానికి సంబంధించిన కేసులు మరో రాష్ట్రంలో ఉంటున్నాయి. ఉదాహరణకు విజయవాడకు చెందిన వారి ఖాతాలను కర్ణాటక సైబర్‌ క్రైం పోలీసులు స్తంభింపజేస్తే అక్కడికి వెళ్లాలి. ఇతర రాషా్ట్రల్లో వారి ఖాతాలను విజయవాడ సైబర్‌ పోలీసులు స్తంభింపచేస్తున్నారు. ఖాతాలను ఏ రాష్ట్రంలో పోలీసులు స్తంభింపచేసినా స్థానిక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిష్కారం చేసుకునే వెసులుబాటును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకురాబోతోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తర్వాత మిగిలిన రాషా్ట్రల్లో అమలు చేస్తారు. లావాదేవీలు ఆగిపోయిన ఖాతాదారులు స్థానిక సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిస్తే ఇక్కడి ఇన్‌స్పెక్టర్‌, ఆ రాష్ట్రంలోని దర్యాప్తు అధికారి, బ్యాంక్‌ మేనేజర్‌ ముగ్గురూ వర్చ్యువల్‌గా సమావేశమవుతారు. కేసును విశ్లేషించుకుని ఖాతాలో నేరానికి సంబంధించిన డబ్బు ఎంత జమయిందో ఆ మొత్తాన్ని మాత్రమే స్తంభింపచేస్తారు. మిగిలిన నగదుతో లావాదేవీలుగా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. దీనివల్ల బాధితులు సుదూర రాషా్ట్రలకు వెళ్లకుండానే స్థానిక ‘ఈ’ కాప్స్‌ ద్వారా ఖాతాను మనుగడలోకి రప్పించుకునే అవకాశం ఉంటుంది.

ఆ లింక్‌లు అనంతం!

నగదు చెల్లింపులు డిజిటల్‌ రూపం తీసుకున్నాక లావాదేవీలు సులభతరమయ్యాయి. తాగిన టీకి పది రూపాయలు ఇవ్వాలన్నా, కొనుగోలు చేసిన వస్తువుకు ఈఎంఐ చెల్లించాలన్నా పేమెంట్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. గూగుల్‌, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఎవరెక్కడ ఉన్నా సులువుగా నగదు లావాదేవీలు జరిగిపోతున్నాయి. కాలు కదపకుండా జరుగుతున్న ఈ చెల్లింపులే కొంతమందిని కేసుల్లో ఇరికిస్తున్నాయి. ఖాతాల నుంచి రూపాయి కదలకుండా చేస్తున్నాయి. పేమెంట్‌ యాప్స్‌ నిత్యం వెంట ఉండడంతో బ్యాంకు మెట్లు అవసరమైతే తప్ప ఎవరూ ఎక్కడం లేదు. తమకు ఉన్న ఖాతాలను గూగుల్‌, ఫోన్‌పే యాప్‌లకు అనుసంధానం చేసుకుని లావాదేవీలు చేసుకుంటున్నారు. పంపిన వ్యక్తి నుంచి డబ్బులు ఖాతాల్లో జమయ్యాయా లేదా అన్నది మాత్రమే పరిశీలించుకుంటున్నారు. పంపిన వ్యక్తికి సంబంధించిన డబ్బులే మనకు వచ్చాయని భావించుకుంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు అజ్ఞాతంలో ఉంటూ కథలు నడిపిస్తున్నారు. బాధితుల నుంచి జమ చేయించుకునే నగదు కోసం ఖాతాలు తెరిచే బాధ్యతలను ఒకరికి అప్పగిస్తారు. జమయిన డబ్బులను తిరిగి తమ ఖాతాల్లో మళ్లించే బాధ్యతలను మరొకరి చేతుల్లో పెడతారు. అక్కడి నుంచి వేర్వేరు ఖాతాలకు వెళ్లిపోతున్నాయి. బాధితుల డబ్బులు ఎన్ని ఖాతాలకు వెళ్తే అన్ని ఖాతాలను పోలీసులు స్తంభింపచేస్తున్నారు. ఆ ఖాతాల నుంచి లావాదేవీలను నిలుపుదల చేయాలని బ్యాంకులకు నోటీసులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో కొంతమంది వేతనాలకు సంబంధించిన ఖాతాలు, నిత్యం ఉపయోగించుకునే ఖాతాలు స్తంభించిపోతున్నాయి. వాటి నుంచి లావాదేవీల పునరుద్ధరణ జరగాలంటే సంబంధిత పోలీసుల నుంచి ఎన్‌వోసీ పొందాల్సి ఉంటుంది. నేరానికి సంబంధించిన ఎంత డబ్బు ఖాతాలో జమయిందో దాన్ని చెల్లిస్తే లావాదేవీలు చేసుకోవడానికి పోలీసులు ఎన్‌వోసీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రకియ రోజుల తరబడి సాగుతోంది. దీనివల్ల నేరంతో సంబంధం లేకపోయినా లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ సమస్యకు స్థానికంగా పరిష్కారం రాబోతోంది.

Updated Date - Mar 04 , 2026 | 01:25 AM