అన్నాబత్తునిపై చీటింగ్ కేసు నమోదు
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:52 AM
ఫోర్జరీ పత్రాలతో రూ.3 కోట్ల రుణం తీసుకొని ఎగవేయడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది
2019లో ఫోర్జరీ పత్రాలతో రూ.3 కోట్ల రుణంపత్రాల్లో చూపిన భూమిలో కొంత 2012లోనే విక్రయం
తిరిగి చెల్లించకపోవడంతో వెలుగులోకి వచ్చిన మోసం
తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ
గుంటూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ పత్రాలతో రూ.3 కోట్ల రుణం తీసుకొని ఎగవేయడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపిన వివరాల మేరకు... గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తన తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ సమాధి పక్కన ఉన్న 1200 గజాల స్థలాన్ని 2019లో విజయవాడకు చెందిన ఐ.కె.ఎఫ్ ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి రూ.3 కోట్ల రుణాన్ని శివకుమార్ భార్య అన్నాబత్తుని పుష్ప ఎండీగా ఉన్న ఏపీజే ఇంటెక్స్ కంపెనీ పేరున తీసుకున్నారు. ఈ కంపెనీలో శివకుమార్, పుష్పతోపాటు తూనుగుంట్ల శ్రీనివాస శివరామ్ భాగస్వామిగా ఉన్నారు. అప్పట్లో శివకుమార్ అధికార పార్టీ ఎమ్మెల్యే కావటంతో ఆయనపై నమ్మకంతో పెద్దగా అభ్యంతరాలు లేకుండానే సంస్థ ప్రతినిధులు రుణం మంజూరు చేశారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో సంస్థ ప్రతినిధులు ఇటీవల తెనాలి వచ్చి రుణం వసూలుకు ప్రయత్నాలు చేశారు. ఆయన తనఖా పెట్టిన 1200 గజాల స్థలం గురించి మున్సిపల్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాకబు చేయగా విస్తుపోయేలాఘరానా మోసం బయటపడింది. ఆ 1200 గజాలలో ఇద్దరు వ్యక్తులకు 250 గజాల చొప్పున మొత్తం 500 గజాలను 2012లోనే అమ్మేసినట్టు బయట పడింది. అంటే, మిగిలిన 700 గజాల స్థలం మాత్రమే వీరి పేరున ఉంది.
అయినప్పటికీ.. 1200 గజాల స్థలం తమ పేరున ఉన్నట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించి రుణం పొందారని తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు తెనాలి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో తమకు అందించిన ఆన్‌లైన్ డాక్యుమెంట్లు, ఈసీలలో స్థలం 1200 గజాలు ఉన్నట్లు చూపించారని, దీంతో ఫోర్జరీ పత్రాలతో తమ సంస్థను మోసం చేసినట్టు తేలిందని ఆ సంస్థ లీగల్ మేనేజర్ శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. అప్పట్లో అన్నాబత్తుని శివకుమార్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ మేనేజ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలను పోలీసులకు సమర్పించామన్నారు. కాగా, ఫైనాన్స్ సంస్థ ఇచ్చిన పత్రాల ఆధారంగా అన్నాబత్తుని శివకుమార్‌కు చెందిన సంస్థపై కేసు నమోదు చేశామని తెనాలి వన్‌టౌన్ సీఐ రాంబాబు తెలిపారు. అన్నాబత్తుని శివకుమార్, అన్నాబత్తుని పుష్ప, తూనుగుంట్ల శ్రీనివాస శివరామ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని 193/2026 వి/ఎస్ 318/(4), 338, 336 (3), 340 (2) 6/డబ్ల్యు 3(5) సెక్షన్ల ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.