ప్రజల్లోకి బలంగా చార్వాక సిద్ధాంతం
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:19 AM
చార్వాక సిద్ధాంతం ప్రజల్లోకి బలంగా వెళుతూ భావితరాలకు చేరుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ
మంగళగిరిలో ప్రారంభమైన 34వ నాస్తిక మేళా
మంగళగిరి సిటీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): చార్వాక సిద్ధాంతం ప్రజల్లోకి బలంగా వెళుతూ భావితరాలకు చేరుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలోని చార్వాక ఆశ్రమంలో నాస్తిక సమాజం, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు జరుగనున్న 34వ నాస్తిక మేళా శనివారం ఉదయం ప్రారంభమైంది. ‘ప్రాచీన భారతంలో చార్వాకం’ అనే అంశంపై ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. ‘వేదాలు నేర్చుకోవడం అంటే బట్టీపట్టడం మాత్రమే. అందులో ఎలాంటి జ్ఞానం లేదు. ఇదే విషయాన్ని చార్వాకులు ముందు నుంచీ చెబుతున్నప్పటికీ మతవాదులు భౌతిక దాడులు చేస్తున్నారు. ఆది భౌతికవాదులు, చార్వాకులు... ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ, దేవుడు, మూఢనమ్మకాలను తిరస్కరించారు’ అని శర్మ గుర్తు చేశారు. ‘వైజ్ఞానికతకు, మత భావాలకు పొసగని మైత్రి’ అనే అంశంపై డాక్టర్ జయకుమార్, ‘పురాణ ప్రలాపం’ అనే అంశంపై జే లక్ష్మీరెడ్డి, ‘దాచేస్తే దాగని సత్యం-జీవ పరిణామం’ అనే అంశంపై కట్టా సత్యప్రసాద్, ‘శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో అవలంభించాల్సిన విధానాలు’ అనే అంశంపై డాక్టర్ సీహెచ్ రవికుమార్, డాక్టర్ శరత్ ప్రసంగించారు. ‘మనిషితనం తప్ప ఏమీ తెలియని వట్టి చేతుల మనిషి చార్వాక రామకృష్ణ’ పుస్తకాన్ని డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ చల్లపల్లి స్వరూపరాణి, సీహెచ్ శివారెడ్డి, చార్వాక ఎస్‌ఎ్‌సఎఫ్ ఆవిష్కరించారు.