చార్జీల బాదుడు
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:21 PM
సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి.
పండుగ పూట ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ
పట్టించుకోని రవాణా శాఖ అధికారులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నంద్యాల టౌన, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రావెల్స్ చార్జీల మోత మోగిస్తున్నాయి. నంద్యాల జిల్లా మీదుగా పదికి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఐదు ట్రావెల్స్ నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాయి. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆయా ట్రావెల్స్ నిర్వాహకులు ఆఽధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఉన్న చార్జీల కంటే రెట్టింపు వరకు ధరలు పెంచి టిక్కెట్లు విక్రయిస్తున్నారని ప్రయా ణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరుకు టికెట్లు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాత డోక్కు బస్సులు సైతం రోడ్డెక్కిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ఇవి పూర్తిగా నిండి పోతున్నాయి. సరిగా నించోవడానికి కూడా చోటు లేకుండా పోయింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌లో వెళ్లాల్సి వస్తుంది.
ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు అధిక సంఖ్యలో బయలుదేరుతున్నారు. నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిల్లాలో 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రం నుంచి అనేక ప్రధాన నగరాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి
నంద్యాల కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయవాడ కు వెళ్లే ప్రధాన నగరాలకు బస్సులు పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులకు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. బస్టాండుల్లో ఉదయం నుంచే ప్రయాణికుల తాకిడి కొనసాగుతోంది.
ప్రైవేటు ట్రావెల్స్ ధరలు
ఎక్కడి నుంచి ఎక్కడికి ...... ఆర్టీసీలో...రూ. ప్రైవేటు ట్రావెల్స్‌లో.. రూ.
నంద్యాల నుంచి హైదరాబాద్ 470 700 నుంచి 2000
నంద్యాల నుంచి బెంగళూరుకు 700 1500
నంద్యాల నుంచి విజయవాడకు 600 1200
నంద్యాల నుంచి తిరుపతికి 420 800
నంద్యాల నుంచి చెన్నైకి 720 1500
అవసరమైతే సర్వీసులు నడుపుతాం.
ప్రయాణికులకు అవసరాన్ని బట్టి సర్వీసులను ఎక్కువగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతానికి 150 సర్వీసులు ఉన్నాయి. అన్ని బస్సులు కండీషనలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం.
ఫ రజియా సుల్తానా. ఆర్‌ఎం, ఆర్టీసీ, నంద్యాల జిల్లా.