పాఠ్య పుస్తకాల్లో మార్పులు..!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:46 AM
వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో 6 నుంచి 8 తరగతుల పాఠ్యపుస్తకాలు మారతాయని, ఆ తర్వాతి విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల పుస్తకాలు మారతాయని..
అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో 6 నుంచి 8 తరగతుల పాఠ్యపుస్తకాలు మారతాయని, ఆ తర్వాతి విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల పుస్తకాలు మారతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ శాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం కరిక్యులమ్ మారుతూ ఉంటుందని, అందుకు అనుగుణంగా జూన్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మేటివ్ అసె్‌సమెంట్-2 పరీక్షలు మార్చి 9న పూర్తవుతాయని, ఆ వెంటనే 10వ తరగతి పాఠ్యాంశాలు బోధించాలన్నారు. మూడో తరగతి విద్యార్థుల ప్రగతిపై 11 నుంచి 13 వరకు సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయ సంఘాలు, సబ్జెక్టు ఫోరమ్‌లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఏడాది కూడా బదిలీలు ఉంటాయని తెలిపారు. జిల్లాల ప్రాతిపదికపై జీఏడీ ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందన్నారు.