Share News

ఏనుగుల సంచార ప్రాంతాల్లో రాత్రివేళ గస్తీ

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:20 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

ఏనుగుల సంచార ప్రాంతాల్లో రాత్రివేళ గస్తీ

  • అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు

  • చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం

అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచారం నేపథ్యంలో అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్లతో వాటి సంచార మార్గాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు, ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. ఏనుగుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట ‘హనుమాన్‌’ బృందాలు మోహరించి, క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా అటవీ శాఖ సూచనలు పాటించాలని కోరారు. ఏనుగుల దాడితో జరిగే పంట, ఆస్తి నష్టాలపై నివేదికలు రూపొందించి బాధితులకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - Aug 17 , 2026 | 05:21 AM