చంద్రబోస్ సోదరుడి మృతి
ABN , Publish Date - May 04 , 2026 | 04:51 AM
ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్న రాజేందర్ ఆదివారం ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరిలో నడిరోడ్డుపై కుప్పకూలి మృతి చెందారు.
కలికిరి, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్న రాజేందర్ ఆదివారం ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరిలో నడిరోడ్డుపై కుప్పకూలి మృతి చెందారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన రాజేందర్ ఆర్టీసీలో పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రెండురోజుల క్రితం ఆయన బెంగళూరు, మదనపల్లె ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం తన స్నేహితుడు శ్రీనివాసులరెడ్డిని కలిసేందుకు కలికిరికి వచ్చారు. అప్పటికే ఆయన హైదరాబాద్‌కు వెళ్లడంతో తాను తిరిగి వచ్చేవరకు తన ఇంట్లో ఉండమని సూచించారు. దీంతో రాజేందర్ కలకడ రోడ్డు సత్యాలేఔట్‌లోని శ్రీనివాసులరెడ్డి నివాసంలో బస చేశారు. కాగా ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందని రాజేందర్ సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన్ను పరీక్షించిన వైద్యుడు ఈసీజీ తీసి అంతా బాగానే ఉందని, మరోసారి ఎక్కడైనా చెకప్ చేయించుకోమని సలహా ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి కలికిరి గాంధీ చౌరస్తా ఎస్బీఐ సమీపంలోని ఒక హోటల్‌లో టిఫిన్ తిన్న రాజేందర్ రోడ్డు పైకి వచ్చి ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి హైదరాబాద్‌లోని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. చెన్నైలోని సమీప బంధువు ముందుగా స్పందించి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. కాగా రాజేందర్‌కు కర్ణాటకలోని చింతామణిలోనూ, మరి కొందరు స్నేహితులతోనూ ఆర్థిక వివాదాలున్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై తమకు అనుమానాలు ఉన్నట్లు హైదరాబాద్‌లోని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. తన సోదరుడి మృతి వార్త తెలియడంతో అమెరికాలో ఉన్న చంద్రబోస్ వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారని, సోమవారం రాత్రికి చేరుకుంటారని కుటుంబ సభ్యులు తెలిపారు.