బోటు మనది.. వేట మనది! కాదని ఎవరైనా వస్తే ఖబడ్దార్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 20 , 2026 | 04:59 AM
రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాలను ఉన్నతస్థితికి చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఈ తీరం మనది. బోటు మనది. వేట మనది.
హద్దుదాటి రావద్దని హెచ్చరిస్తున్నా
‘మత్స్యకారుల సేవలో..’ సభలో సీఎం వ్యాఖ్యలు
టీడీపీ డీఎన్‌ఏలోనే బీసీలు..వారికి రుణపడ్డాం
60శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు
మాది సంక్షేమ ప్రభుత్వం.. గొడ్డలి పార్టీది ఫేక్ ప్రచారం
వేట విరామ భృతి కింద రూ.261 కోట్లు పంపిణీ
మన మత్స్యకారులకు చెందాల్సిన సముద్ర సంపదను పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు దొంగతనంగా, దౌర్జన్యంగా వచ్చి దోచుకొని పోతున్నాయి. ఇకపై వాటి ఆటలు సాగవు. తీరం వెంబడి శాటిలైట్ నిఘా ఏర్పాటు చేశాం. పక్క రాష్ట్రాలకు చెందిన బోట్లు మన జలాల్లోకి ప్రవేశించిన వెంటనే జిల్లా కలెక్టర్లకు మెసేజ్ వెళుతుంది. వెంటనే అప్రమత్తమై ఆ బోట్లను అధికారులు కట్టడి చేస్తారు.
- సీఎం చంద్రబాబు
నెల్లూరు, మే 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాలను ఉన్నతస్థితికి చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఈ తీరం మనది. బోటు మనది. వేట మనది. కాదని పక్క రాష్ట్రాల బోట్లు మన సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తే వదిలే ప్రసక్తే లేదు. వెంటాడుతాం.. వేటాడుతాం.. ఇందులో రాజీ లేదు. ఇది సీబీఎన్ మాట.’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం జరిగిన ‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వేట విరామ భృతి కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు చొప్పున రాష్ట్రంలోని 1,30,796 కుటుంబాలకు రూ.261.50 కోట్ల ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మత్స్యకార కుటుంబాలున్నాయి. తరతరాలుగా బతుకు తెరువు కోసం ప్రాణాలకు తెగించి సముద్ర వేటతో జీవనం సాగిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ వర్గాలను, వారి కష్టాలను తొలిసారిగా గుర్తించిన నాయకుడు ఎన్టీఆర్. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వరకు వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం సాయాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వం తెలుగుదేశం. తొలుత 31 కిలోల బియ్యం ఇచ్చాం. తుఫాను సమయాల్లో 50 కేజీల చొప్పున బియ్యం అందజేశాం. వేట విరామ సమయంలో జీవన భృతి కోసం 2014-15లో తొలిసారి రూ.2వేలు ఇచ్చాం. ఆ తరువాత దానిని పది వేలకు పెంచాను. ఇప్పుడు రూ.20వేలకు పెంచాను. మోటారు బోట్లకు సబ్సిడీ ధరకు డీజిల్ ఇస్తున్నాం. ఈ బడ్జెట్‌లో డీజిల్ సబ్సిడీ కింద 50 కోట్లు విడుదల చేశాం. మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా 3,256కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం’’ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లు
‘‘మెకనైజ్డ్ బోట్లు ఇస్తే అభివృద్ధి చెందుతామని మత్స్యకారులు అడిగారు. వారి కోరిక మేరకు 200 మెకనైజ్డ్ బోట్లు మంజూరు చేస్తున్నాం. వాటిని 60 శాతం సబ్సిడీతో ఇస్తాం. తక్కిన 40శాతం బ్యాంక్ రుణంగా ఇప్పిస్తాం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేపల లభ్యత, రక్షణపరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నాం. మత్స్యకారుల రక్షణ కోసం 4,550 ట్రాన్స్‌పాండర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై వారికి సమాచారం అందిస్తున్నాం. కావలి ఫిషింగ్ హార్బర్‌లో స్థాపించనున్న సాగర్ ఢిపెన్స్ సంస్థ ద్వారా డ్రోన్ల పర్యవేక్షణలో ఎక్కడ చేపలు ఎక్కువగా ఉన్నాయో కూడా సమాచారం తెలుస్తుంది. మత్స్యకార కుటుంబాలకు చెందిన ఆడపడుచుల ద్వారా సముద్ర నాచు పెంపకాన్ని ప్రారంభిస్తాం. త్వరలోనే ఆ ఆర్థిక విప్లవాన్ని చూస్తారు. చేపల ఎగుమతుల్లో దేశం వాటా 28శాతంగా ఉంటే, అందులో ఏపీ వాటా 38 శాతం. రొయ్యల ఎగుమతుల్లో 80శాతం ఉత్పత్తులు రాష్ట్రంనుంచే ఉన్నాయి.’’
గొడ్డలి పార్టీది ఫేక్ ప్రచారం
‘‘కొత్తగా నిర్మాణమవుతున్న పోర్టులు, పోర్టుల ఆధారంగా వస్తున్న పరిశ్రమలపై గొడ్డలి పార్టీ (వైసీపీ) తప్పుడు ప్రచారం చేస్తోంది. వాటిని నమ్మొద్దు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో నిర్మించనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమపై అనుమానాలు వద్దు. వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఇది దేశ రక్షణ కోసం స్థాపిస్తున్న పరిశ్రమ. దీనివల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందే తప్ప ఎలాంటి నష్టం ఉండదు. రామాయపట్నం, ఫిషింగ్ హార్బర్‌లో రానున్న పరిశ్రమల్లో మత్స్యకార కుటుంబాలకు చెందిన యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.’’