కుప్పం గంగమ్మ సేవలో ముఖ్యమంత్రి
ABN , Publish Date - May 21 , 2026 | 04:46 AM
చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా జరిగింది. ఆలయంలో విశ్వరూపంలో దర్శనమిచ్చిన గంగమ్మ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు...
పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
కుప్పం, మే 20 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర వైభవంగా జరిగింది. ఆలయంలో విశ్వరూపంలో దర్శనమిచ్చిన గంగమ్మ సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 11 సమయంలో ఆలయం వద్దకు వచ్చిన సీఎం దంపతులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మొక్కుకున్నారు. ఆలయంలో సుమారు అరగంట సమయం గడిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు హెలికాప్టర్‌లో బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

ఆహా.. ఏమి రుచి..
తాటిముంజెల రుచికి సీఎం ఫిదా..
కుప్పం గంగమ్మ విశ్వరూప దర్శనం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శాంతిపురం మండలం కడపల్లె వద్ద గల స్వగృహానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంమధ్యలో తంజమ్మ కొట్టాలు వద్ద రోడ్డు పక్కన విక్రయిస్తున్న తాటిముంజెలను చూసి ఆగారు. కారు దిగి వెళ్లి లేలేత తాటిముంజెలు కొట్టించుకుని తిన్నారు. రుచిగా, చల్లగా ఉన్నాయంటూ ముంజెల విక్రేతలను మెచ్చుకున్నారు. వారి కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో గ్రూప్ ఫొటో దిగారు. నగదు చెల్లించాక ఇంటికెళ్లిన చంద్రబాబు.. తాటి ముంజెలు తిన్న అనుభవాన్ని ఫొటోతో సహా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగు మందుల గోల లేదు.. మా కుప్పం ప్రజల మనసులాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజెలు రోడ్డు పక్కన ఆగి తింటుంటే ఎంతో హాయిగా ఉంది. మన గ్రామీణ ఆహార ఉత్పత్తులను మించింది ఏముంటుంది!’ అంటూ ఆ పోస్టులో సీఎం వర్ణించారు. - (కుప్పం, ఆంధ్రజ్యోతి)