6 నెలల్లో స్థానిక ఎన్నికలు!
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:16 AM
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాటికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు.
ఇప్పటి నుంచే సమాయత్తమవ్వండి
మంత్రులకు చంద్రబాబు పిలుపు
ఎన్నిక ఏదైనా కూటమే గెలవాలి
క్షేత్రస్థాయి పర్యటనలు పెంచండి
చేసిన మంచి చెప్పుకోవడంలో విఫలం
మే 15 నాటికి సాగునీటి విడుదల జరగాలి
ఈలోపే కాల్వలు, డ్రెయిన్లు శుభ్రం చేయించాలి
జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతలను తిరిగి గాడిలో పెట్టాలి
చివరి ఎకరా వరకు నీరందాలి
90 రోజులపాటు ‘జలధార’
భూగర్భ జలాల పెంపునకే: ముఖ్యమంత్రి
క్యాబినెట్ భేటీకి హాజరుకాని డిప్యూటీ సీఎం
మరో ఐదుగురు మంత్రులు కూడా..
అధికారులకైనా.. మంత్రులకైనా ఒకటే చెబుతా! మనం ప్రజల్లో ఉంటే వారు మనతో ఉంటారు. క్షేత్ర స్థాయిలో ఎక్కువగా ఉంటే జనం సమస్యలేమిటో తెలుస్తాయి.
ప్రపంచంలో ఏమూలకెళ్లినా తెలుగువారు ఉంటారు. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్న మనోళ్లకు కష్టమొచ్చింది. వారిని ఆదుకోవడం మన కనీస కర్తవ్యం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాటికి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. శుక్రవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన వారితో చర్చించారు. జగన్ ఐదేళ్ల ఏలుబడిలో రాష్ట్రంలో చేసిన విధ్వంసాన్ని వివరిస్తూనే.. గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని కోరారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనం గెలిచామని.. ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని స్పష్టం చేశారు. మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలను పెంచాలన్నారు. రైతులకు సాగునీటిని సకాలంలో అందించడంపై దృష్టి సారించాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదేశించారు. మే 15వ తేదీకల్లా సాగునీటి విడుదల జరగాలని తేల్చిచెప్పారు. ఈలోగానే కాల్వలు, డ్రెయిన్లను శుభ్రం చేయించాలన్నారు. జగన్ జమానాలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు 7 లక్షల ఎకరాలకు నీరు అందలేదన్నారు. చివరి ఎకరాకూ నీరు చేరాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులను కోరారు. ఏప్రిల్ నుంచి 90 రోజులు రాష్ట్రవ్యాప్తంగా జలధార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశామన్నారు. పంచాయతీల్లో పన్నుల వసూలు బాగా జరుగుతోందని.. ఇదే తరహాలో నీటి తీరువా వసూలు దిశగా నీటి సంఘాలను సన్నద్ధం చేయాలని మంత్రి నిమ్మలకు సూచించారు.
గ్యాస్ కొరత తలెత్తకూడదు..
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలో గ్యాస్ కొరత తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. గ్యాస్‌కి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఎలక్ట్రిక్ పొయ్యిలు వాడడం మొదలు పెట్టారని తెలిపారు. వాటి వినియోగం పెరిగితే విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని.. ఆ డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్‌కు సీఎం సూచించారు.
మీ పనితీరుపై 2న నివేదికలిస్తా..
2025-26 సంవత్సరానికి సంబంధించి శాఖలవారీగా పనితీరు నివేదికలను ఏప్రిల్ 2న అందజేస్తామని మంత్రులకు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా సమీక్షించుకుని రానున్న సంవత్సరంలో పురోగతి సాధించాలని వారికి సూచించారు. ఈ నివేదికలో మంత్రులు, శాఖాధిపతుల పనితీరుపై సమగ్ర వివరాలు ఉంటాయన్నారు. ఫైళ్ల క్లియరెన్సు, లక్ష్యాలను చేరుకోవడం, కేంద్రం నుంచి నిధుల సాధన-వాటి వ్యయం.. వినూత్నంగా చేపట్టిన కార్యక్రమాలు మొదలైనవాటి ఆధారంగా పనితీరు నివేదికలను రూపొందించామని తెలిపారు.
ఎంతో మంచి చేసినా..: చాలా మంది మంత్రులు బాగా పనిచేస్తునా..్న చేసిన పనులను చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో మంచి కార్యక్రమాలను అమలు చేసిందని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నామని అన్నారు. ఈ విషయంలో సాంకేతికతను కూడా వాడుకుని.. చేసిన మంచిని జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని.. వివిధ అంశాలపై పార్టీ నుంచి వచ్చే వివిధ రకాల సోషల్ మీడియా పోస్టులను రీపోస్టు చేయడంలోనూ మంత్రులు వెనుకబడుతున్నారని వ్యాఖ్యానించారు.
రవీంద్రభారతి తరహాలో అమరావతిలో కూడా..
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి తరహాలో అమరావతిలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఓ భవనం నిర్మించేందుకు ఆమోదం తెలిపామని, దానికి మంచి తెలుగు పేరు సూచించాలని మంత్రులను సీఎం కోరారు. అలాగే పొట్టి శ్రీరాములు విగ్రహానికి కూడా తెలుగు పేరు సూచించాలన్నారు.
వెలిగొండ తొలి దశను అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులనూ పూర్తి చేసేందుకు ఆర్థిక, జలవనరుల మంత్రులు మాట్లాడుకుని సమన్వయంతో వెళ్లాలని చంద్రబాబు సూచించారు.
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని.. తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 3వేల గ్రామాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జల్‌జీవన్ మిషన్ కింద ఎంపిక చేశారని, రూ.9 వేల కోట్లతో అక్కడ పనులు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు.
రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాలు ఘటనలాంటివి పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఈ నెల 16న అమరావతిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఆ రోజు అన్ని జిల్లాల్లోనూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు.
పవన్ సహా ఆరుగురు మంత్రులు దూరం..
మంత్రివర్గ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆరుగురు మంత్రులు హాజరుకాలేదు. హోం మంత్రి అనిత, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి అనారోగ్య కారణాలతో రాలేకపోయారు. జనసేన ఆవిర్భావ దినోత్స ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రాలేదు. టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్ వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోయారు.