Share News

‘పోలవరం-బనకచర్ల’ను ఆమోదించండి

ABN , Publish Date - May 10 , 2026 | 06:12 AM

పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్‌) అనుసంధాన పథకం ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు(పీఎ్‌ఫఆర్‌)ను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రాథమికంగా అంగీకరించినందున, దీనికి ఆమోదం తెలపాలని...

‘పోలవరం-బనకచర్ల’ను ఆమోదించండి

  • పోలవరం రెండో దశకు 32,000 కోట్లు ఇవ్వండి

  • రేపు కేంద్ర మంత్రి పాటిల్‌ను కోరనున్న సీఎం

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్‌) అనుసంధాన పథకం ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు(పీఎఫ్ఆర్‌)ను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రాథమికంగా అంగీకరించినందున, దీనికి ఆమోదం తెలపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. అలాగే గోదావరి జలాల వినియోగంపై పొరుగు రాష్ట్రాలతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ వేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం చంద్రబాబు కోరనున్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం రూ.32,000 కోట్లను మంజూరు చేయాలని కోరనున్నారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల విస్తరణ పనుల కోసం చేస్తున్న అదనపు వ్యయాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించనున్నారు. అదేవిధంగా చిన్న, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల రిపేర్‌, రిస్టోరేషన్‌, రిన్నోవేషన్‌(త్రిబుల్‌-ఆర్‌) పథకానికి నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. సముద్రంలోకి వృఽథాగా పోతున్న దాదాపు 3000 టీఎంసీల వరద జలాల్లో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునేలా పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేశామని వివరించనున్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి కేటాయింపులు చేసేందుకు ట్రైబ్యునల్‌ అవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వవద్దని కోరనున్నారు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తును 119 మీటర్ల నుంచి 124 మీటర్లకు పెంచేందుకు చేస్తున్న భూసేకరణ ప్రక్రియ సహా ఎత్తు పెంచేందుకు అనుమతులు ఇవ్వవద్దని విన్నవించనున్నారు.

Updated Date - May 10 , 2026 | 06:13 AM