Share News

లాటరైట్‌ మైనింగ్‌కు పాత నిబంధనలు కొనసాగించండి

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:43 AM

లాటరైట్‌ మైనింగ్‌ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు అవకాశం కల్పించేందుకు పాత నిబంధనలనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

లాటరైట్‌ మైనింగ్‌కు పాత నిబంధనలు కొనసాగించండి

  • పెండింగ్‌ దరఖాస్తులకు అవకాశం ఇవ్వండి.. కేంద్రానికి సీఎం లేఖ

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): లాటరైట్‌ మైనింగ్‌ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు అవకాశం కల్పించేందుకు పాత నిబంధనలనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లాటరైట్‌ మైనింగ్‌ విషయంలో సేవింగ్‌ క్లాజ్‌ అమలు చేయాలని కోరుతూ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం లేఖ రాశారు. బాక్సైట్‌ మైనింగ్‌ విషయంలో కేంద్రం ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చింది. లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్‌గానే పరిగణించాలని పేర్కొంది. దీంతో లాటరైట్‌ లీజులకోరుతూ వచ్చిన 402 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికే 19 దరఖాస్తులకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌ఓఐ)లు ఇచ్చినవి ఉన్నాయి. ఇవికాకుండా మరో 113 దరఖాస్తులు ప్రభుత్వ భూములు, 255 అటవీ భూములు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయి. కేంద్రం నిర్ణయం వల్ల ఏపీలో లాటరైట్‌ గనుల లీజుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు పాత నిబంధనలే వర్తింపచేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పాత నిబంధనల మేరకు దరఖాస్తుదారులు అప్లికేషన్‌ ఫీజులు చెల్లించారని, భూములు కొనుగోలు చేసి అటవీ, పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారని ఆ లేఖలో వివరించారు. గతంలో మైకా, క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌, బాక్సైట్‌ ఖనిజాలను మైనర్‌ నుంచి మేజర్‌ మినరల్స్‌గా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్‌ క్లాజు ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్‌ ఖనిజానికి కూడా సేవింగ్‌ క్లాజ్‌ అనుమతి ఇచ్చి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పాత నిబంధనల కిందే ప్రాసెస్‌ చేసేలా రెండేళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 04:43 AM