ఏపీలో జాతీయ మాంస, పౌల్ర్టీ అభివృద్ధి బోర్డు
ABN , Publish Date - Apr 11 , 2026 | 02:59 AM
జాతీయ మాంస, పౌల్ర్టీ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎంపీడీబీ)ను ఏపీలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏర్పాటు చేయాలంటూ ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): జాతీయ మాంస, పౌల్ర్టీ అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎంపీడీబీ)ను ఏపీలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన సంస్థాగత, పరిపాలనాపరమైన మద్దతు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఈ నెల 8న చంద్రబాబు లేఖ రాశారు. పశు సంపద.. వ్యవసాయ వృద్ధికి కీలకంగా ఉందని, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో 30ు కన్నా ఎక్కువ వాటా ఇస్తోందని సీఎం లేఖలో తెలిపారు. మార్కెట్‌లో పోటీ తత్వం కోసం రాష్ట్రంలో మాంస, పౌల్ర్టీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పశు మాంస రంగం అసంఘటితంగా ఉండటం, మాంసం శుద్ధి యూనిట్లు, నాణ్యత, ట్రేసబులిటీ లేకపోవడం, పరిమిత విలువ జోడింపు, జంతు ఆరోగ్య, జీవ భద్రతా ప్రమాణాలు, ఎగుమతుల పరిమితులు, మార్కెట్ అవరోధాలు, నైపుణ్యం, సాంకేతిక లోపాల కారణంగా ఈ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. 2024-25 గణాంకాల ప్రకారం ఏపీలో పశువులు, కోళ్ల మాంసం 10.68లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అలాగే లేయర్ కోళ్లు 8కోట్లు, బాయిలర్ కోళ్లు 4కోట్లు ఉండగా, 149బిలియన్ల కోడిగుడ్లు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ మాంస, పౌల్ర్టీ అభివృద్ధి బోర్డును ఏపీలో స్థాపించి, ఈ రంగం అభివృద్ధికి, ఆదాయవృద్ధికి సహకరించాలని కోరారు.