Share News

సమాజమే ఎక్కువ నేర్పింది

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:38 AM

ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరిగితే సరిపోదని, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందన్నదే పాలనకు అసమైన కొలమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సమాజమే ఎక్కువ నేర్పింది

  • జీవితాల్లో మార్పే అభివృద్ధికి కొలమానం

  • ప్రజాసేవ, సంపద సృష్టి రెండూ కీలకమే

  • అందుకే ప్రైవేటు పెట్టుబడులకు ప్రాధాన్యం

  • ‘ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ గవర్నెన్స్‌’ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి

తిరుపతి సిటీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరిగితే సరిపోదని, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందన్నదే పాలనకు అసమైన కొలమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ గవర్నెన్స్‌ కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌’ గురువారం తిరుపతిలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డేటా ఆధారిత పాలన, సాంకేతికత, సమర్థవంతమైన పరిపాలన ద్వారానే రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమన్నారు. ప్రస్తుతం డేటానే సంపదగా మారిందని, భవిష్యత్‌లో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని సీఎం అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టించేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కూడా అంతే కీలకమని తెలిపారు. అందుకే స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో ప్రైవేటు పెట్టుబడులను ప్రధాన అంశంగా చేరుస్తున్నామని చంద్రబాబు వివరించారు.


అర్థ శాస్త్రం చదివినా...

పేద-ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని సీఎం అన్నారు. ‘‘నేను అర్థ శాస్త్రం చదివినప్పటికీ, పుస్తకాల కంటే సమాజం, ప్రజల నుంచే ఎక్కువ నేర్చుకున్నా.’’ అని తెలిపారు.

ఏపీ విధానాలు భేష్‌

వర్క్‌షాప్‌ సందర్భంగా వివిధ అంశాలపై ప్యానెల్‌ చర్చలు జరిగాయి. కేంద్ర గణాంకాల శాఖ శాఖ కార్యదర్శి సౌరభ్‌ గార్గ్‌, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌, నీతి ఆయోగ్‌ సభ్యులు ఆర్‌.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్‌ కేవీ రాజు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్ర దేవ్‌లతో కూడిన ప్యానెల్‌ జరిపే చర్చలను సభికుల మఽధ్య కూర్చొని చంద్రబాబు ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలను నిపుణులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. నియోజకవర్గాలవారీ విజన్‌ ప్లాన్‌, పీ4కార్యక్రమం, గ్రామస్థాయిలో డేటా సేకరణ, పాలనలో ఏఐ వినియోగం వంటి అంశాల్లో చంద్రబాబు తీసుకున్న చొరవను ప్రశంసించారు.

Updated Date - Jul 03 , 2026 | 04:40 AM