Share News

యుద్ధప్రభావం పడకుండా సన్నద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:01 AM

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం రాష్ట్రంపై పడకుండా తగిన సన్నద్ధతతో ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

యుద్ధప్రభావం పడకుండా సన్నద్ధంగా ఉండాలి

  • ఎల్పీజీ, కోళ్ల పరిశ్రమ, ఉద్యానంపై అప్రమత్తత అవసరం

  • గల్ఫ్‌లోని ప్రవాసాంధ్రుల యోగక్షేమాలు తెలుసుకోవాలి

  • ఉగాదికి రెండున్నర లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

  • సీసీ కెమెరా నెట్‌వర్క్‌ ద్వారా నేర నియంత్రణ

  • ఆర్టీజీఎస్‌పై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం రాష్ట్రంపై పడకుండా తగిన సన్నద్ధతతో ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గల్ఫ్‌ దేశాలతో సంబంధం ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆర్టీజీఎస్‌ కార్యాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటిపై యుద్ధం వల్ల పడే ప్రభావం విషయంలో అధికారులు అప్రమత్తతతో ఉండాలన్నారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల భద్రతపై నిరంతరం సమీక్షించాలని సూచించారు. ప్రవాంధ్రుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ దాని ఆధారంగా రక్షణ చర్యలు చేపట్టడంపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. నిరంతరం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. ప్రవాసాంధ్రుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ అధికారులు, కేంద్రం ఒక బృందంగా ఏర్పడాలని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారికి భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


విద్యుత్‌ కొరత లేకుండా కార్యాచరణ

రాష్ట్రవ్యాప్తంగా అందిస్తున్న విద్యుత్తు సరఫరాపై సీఎం ఆరా తీశారు. విద్యుత్తు పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్తు సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరా వంటి అంశాలపైనా సీఎం సమీక్షించారు. ప్రస్తుత విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా 14013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్తు కొరత రాకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. పాఠశాల విద్యకు సంబంధించి సిలబస్‌ పూర్తి, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన మంచినీరు, శుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టిసారించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు తృణ ధాన్యాలతో పాటు. పౌష్టికాహారాన్ని అందించాలన్నారు.

డీజీసీఏ సహకారంతో డ్రోన్‌ పైలట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

ఉగాది పర్వదినం నాడు రాష్ట్రంలో సామూహికంగా రెండున్నర లక్షల గృహాల ప్రారంభోత్సవాలు చేపడుతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుకు భారత్‌ జెన్‌, నెక్స్‌జెన్‌, ఐబీఎం లాంటి సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఏఐ కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి రైతుకూ సహకారం అందించేలా ఏఐ అగ్రానమిస్ట్‌ విద్యాబోధనకు సహకారం అందించేలా ఏఐ ట్యూటర్‌ విధానం చేపట్టాలన్నారు. ప్రధానంగా వైద్య రంగంలోనూ ఏఐ ఆధారిత సేవలు అందించడంపై దృష్టి సారించాలని అన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 04:05 AM