చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే భవిష్యత్తు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:04 AM
‘‘ప్రస్తుత సీఎం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి.
వైసీపీ పాలనలో ఫైట్ చేసిన జన సైనికులను కలుపుకొని వెళ్లాలి
బీజేపీ మద్దతుతోనే అభివృద్ధి పరుగు
‘ఒక్క చాన్స్’ అన్న జగన్ రాష్ట్రాన్ని అన్నివిధాలా 20 ఏళ్లు వెనక్కి నెట్టాడు
సర్పంచ్‌ల సన్మాన సభలో మంత్రి కొండపల్లి
విజయనగరం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రస్తుత సీఎం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కూటమిలోని మూడు పార్టీలూ కలిసికట్టుగా ఉంటేనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది.’’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని నెలివాడ గ్రామంలో వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న టీడీపీ సానుభూతిపరులైన సర్పంచ్‌లకు మంత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ నేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు జనసైనికులు ధైర్యంగా ముందుకొచ్చి నాటి ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి సేవలను గుర్తుంచుకొని వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని టీడీపీ కేడర్‌కు సూచించారు. బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. కూటమి పార్టీలు ఐక్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా మరోసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. ‘ఒక్క చాన్స్’ అని పేదలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని అన్ని విధాలా 20 ఏళ్లు వెనక్కు నెట్టారని విమర్శించారు. సెర్ప్ డిపార్ట్‌మెంట్‌కు గత ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులను పూర్తిగా వినియోగిస్తే వచ్చే బడ్జెట్‌లో మరింతగా నిధులు పెంచుతామని తెలిపారు. వైసీపీ అధినేత 2019-24 మధ్య పేదలు, ప్రజల కోసం పని చేయలేదని, వారి వ్యాపారాలు, వ్యక్తిగత అవసరాల కోసం పాలన సాగించారని విమర్శించారు. ఈ విషయం వైసీపీ నేతలకు కూడా తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండపల్లి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.