సామర్థ్యం పెంపుతో ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం
ABN , Publish Date - May 14 , 2026 | 05:32 AM
రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్ఠం చేసేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
త్వరలోనే పూర్తి స్థాయి డేటా డ్రివెన్ గవర్నెన్స్: చంద్రబాబు
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్ఠం చేసేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై సమీక్ష సందర్భంగా జీఎస్డీపీ, కెపాసిటీ బిల్డింగ్, ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రధాన సర్వేలు, జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణలు, కేపీఐల ఆడిటింగ్ అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. 15శాతం వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికోసం రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు 3నెలల పాటు శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ‘‘త్వరలోనే పూర్తి స్థాయి డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడతాం. జీఎస్డీపీ అంచనాలను రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా రూపొందించేలా శిక్షణ ఉండాలి. జీఎస్డీపీ అంచనాలు 3 నెలలకు, ఏడాదికి రూపొందిస్తుండటంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యంకావడం లేదు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతినెలా, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ట్రాక్ చేయగలిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి. జీఎస్డీపీ విధానాన్ని అర్థంచేసుకునేలా, అంచనాలు వేగంగా రూపొందించేలా అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు.