అమరావతి-బెంగళూరు బుల్లెట్ రైలు వయా చిత్తూరు!
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:16 AM
కేంద్రం ప్రకటించినట్టు రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు పరుగులు పెడితే..! అలాగే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకు...
సీఎం చంద్రబాబు వ్యూహాత్మక ప్రతిపాదన
బెంగళూరు-చెన్నై హై స్పీడ్ కారిడార్‌తో లింకు
బడ్జెట్‌లో చిత్తూరు మీదుగా ఈ కారిడార్ ప్రకటన
చిత్తూరు-తిరుపతి మధ్య బాబు ప్రపోజల్
కేంద్రం ఓకే చేస్తే అమరావతికి 2 బుల్లెట్ రైళ్లు
గుంటూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించినట్టు రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు పరుగులు పెడితే..! అలాగే అమరావతి నుంచి నేరుగా బెంగళూరుకు హై స్పీడ్ రైల్ కారిడార్ అనుసంధానం చేస్తే..! రాజధాని రూపురేఖలే మారిపోతాయి! కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు మరో వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. దీనివల్ల తక్కువ ఖర్చుతోనే అమరావ తి రాజధానికి మరో హై స్పీడ్ రైల్ కారిడార్‌తో కనెక్టివిటీ లభించే అవకాశముంది. కేంద్ర బడ్జెట్‌లో అమరావతి రాజధాని మీదుగా హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏపీ మీ దుగా వెళ్లేలా ప్రకటించింది. బెంగళూరు-చెన్నై కారిడార్ చిత్తూరు మీదుగా ఉన్నది. ఈ కారిడార్‌లో చిత్తూరు-తిరుపతి మధ్యన 75 కిలోమీటర్ల వ్యూహాత్మక కనెక్టివిటీని ఇస్తే అది బెంగళూరు-అమరావతికి ఎంతో మేలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవకు కూడా తెలియజేశారు.
కేంద్రం ఈ ప్రతిపాదనను పరిగణనలో కి తీసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనివల్ల రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఇటు హైదరాబాద్-చెన్నై, అటు బెంగళూరు-చెన్నై అనుసంధానంగా ఉంటాయి. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్-అమరావతి-గుంటూరు-తిరుపతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను మంజూరు చేసింది. చిత్తూరు నుంచి తిరుపతి వరకు 75 కిలోమీటర్ల రైల్ కారిడార్ నిర్మాణంతో బెంగళూరు కనెక్టివిటీ కూడా ఉంటే అమరావతి మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని సీఎం భావిస్తున్నారు. కేంద్రం అంగీకరిస్తే హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలుతో పాటు బెంగళూరు నుంచి నేరుగా అమరావతికి బుల్లెట్ రైలు వచ్చే అవకాశముంది. అంతేగాక హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్లు దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలను ప్రాంతీయంగా ఏకీకృతం చేస్తాయి.