13 ఏళ్లలోపు వారికి సోషల్‌మీడియా నిషేధం
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:32 AM
చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి ముందు సీఎం పలు అంశాలపై మాట్లాడారు.
90 రోజుల్లో చట్టం తీసుకొస్తాం
అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
కర్ణాటకలోనూ బ్యాన్ చేస్తామన్న సిద్దరామయ్య
ఇప్పటికే 16 ఏళ్ల లోపువారికి ఆస్ట్రేలియాలో నిషేధం
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): చిన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. శాసనసభలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి ముందు సీఎం పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా విషయాన్ని ప్రస్తావిస్తూ.. సామాజిక మాధ్యమాలు పిల్లలకు అందుబాటులో ఉండకుండా ఉంటే బావుంటుందన్న సూచనలు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్‌మీడియా వినియోగం నుంచి దూరం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అయితే, వయోపరిమితి పదమూడా? లేదా పదహారా? అనేది చర్చించి నిర్ణయిస్తామన్నారు. 90 రోజుల వ్యవధిలో ఈ విషయంలో చట్టం తీసుకొస్తామని చెప్పారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, దుర్వినియోగం చేస్తే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. కాగా, గత జనవరిలో మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో మహిళలు, చిన్నపిల్లల రక్షణకు నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా 16ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికే 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగాన్ని ఆస్ట్రేలియా నిషేధించింది. పోలాండ్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోనుంది.