Share News

మూడు రీజియన్లలో స్పోర్ట్స్‌ సిటీలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 05:11 AM

అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మూడు రీజియన్లలో స్పోర్ట్స్‌ సిటీలు

  • అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగేలా అభివృద్ధి

  • ఎకనమిక్‌ రీజియన్లపై సమీక్షలో చంద్రబాబు

అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అమరావతి, తిరుపతి, విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్‌సిటీల అభివృద్ధి జరగాలన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరంలో సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లో బీచ్‌ ఫ్రంట్‌ల అభివృద్ధి కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రెండు నెలల్లో ప్రతి జిల్లాకు ఎకనమిక్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రాష్ట్రంలోని మూడు ఎకనమిక్‌ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణపై పలు మార్గదర్శకాలు సూచించారు. 6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్ల మాస్టర్‌ప్లాన్‌ కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన కడప జిల్లా లింగాల మండలం స్ఫూర్తితో రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ పురోగతికి హార్టికల్చర్‌ గ్రోత్‌ ఇంజిన్‌ అవుతుందన్నారు. ఇక్కడ 25కు పైగా ఉద్యాన ఉత్పత్తులు సాధించేలా చూడాలన్నారు. ఈప్రాంత స్థితిగతులు మార్చే శక్తి హార్టికల్చర్‌కు ఉందన్న సీఎం.. తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ మాస్టర్‌ప్లాన్‌లో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్లు, ప్రైవేట్‌ పెట్టుబడుల రూపంలో వచ్చే మరో రూ.60,000 కోట్లు ఉద్యానవన రంగానికి ఊతమిస్తాయని చెప్పారు. పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే సీమలోని ఓ మండలంలో ప్రజల తలసరి ఆదాయం అధికంగా ఉండడాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. లింగాల మండలంలో ప్రజలు రూ. 7.30 లక్షల తలసరి ఆదాయం కలిగి ఉండడం హార్టికల్చర్‌ పంటల లాభాలకు నిదర్శనమన్నారు. సీమలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను తీసుకొస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.


పర్యావరణ హితంగా బేసిటీ

వైజాగ్‌ బే సిటీని పర్యావరణ హితంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, నివాసయోగ్యంగా అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. బే సిటీలో 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి లభ్యత ఉందని గుర్తించినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్లో ఇప్పటికే మొత్తం 49 ప్రాజెక్టులు రాగా వీటిలో 18 ప్రాజెక్టుల పనులు మొదలయ్యాయని, మరో 12 త్వరలో మొదలవుతాయని, ఇంకో 19 ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయని వివరించారు. వీటితో పాటు రాబోయే 3 నెలల్లో లక్ష చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అరకు-పాడేరు-విశాఖను పర్యాటక సర్కిల్‌గా రూపొందించి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలన్నారు.

అమరావతి రీజియన్‌కు కలిసొచ్చే అంశాలు

రాష్ట్ర జనాభాలో 32 శాతం అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌లో నివసిస్తున్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో ఉండడం, నైపుణ్యం కలిగిన మానవవనరులు ఉండడం ఈ రీజియన్‌కు కలిసొచ్చే అంశమని చెప్పారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం మొత్తం 9 జిల్లాలు అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలో ఉండగా తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా ముందుందని చెప్పారు. ఆక్వా, పామాయిల్‌, కోకో ఉత్పత్తులతో పాటు కొల్లేరు సరస్సును రీజియన్‌ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.

అభివృద్ధిలో పోటీగా తిరుపతి

ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్‌ వరకు పుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు రాయలసీమకు ఉన్న అనుకూలతను మార్కెటింగ్‌ చేసుకోవాలని సీఎం చెప్పారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటాపోటీగా ఇక్కడ అభివృద్ధి జరగాలన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఐఐటీ వంటి విద్యాసంస్థలు, బంగారం, ఇనుప ఖనిజాలు, సున్నపురాయి సీమ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. గండికోట, హార్సిలీహిల్స్‌, తలకోన వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయాలని చెప్పారు. స్పేస్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, డ్రోన్లు ఇలా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు తిరుపతి అనుకూలమన్నారు. మౌలిక వసతులను వినియోగించుకుని ఈ రీజియన్‌ను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలన్నారు. ప్రతి 2 నెలలకొకసారి 3 ఎకనమిక్‌ రీజియన్లపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Jul 07 , 2026 | 05:11 AM