ప్రభుత్వ కార్యాలయాల్లో సర్టిఫికెట్లు అడగొద్దు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:45 AM
రాష్ట్రంలో ప్రజలకు ఒక ప్రభుత్వ విభాగం ఇచ్చిన వివిధ రకాల ధ్రువీకరణ సర్టిఫికెట్లను మరో ప్రభుత్వ విభాగానికి ప్రజలు పత్రాల రూపంలో...
డిజి వెరిఫైలో పరిశీలించాలి.. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలకు ఒక ప్రభుత్వ విభాగం ఇచ్చిన వివిధ రకాల ధ్రువీకరణ సర్టిఫికెట్లను మరో ప్రభుత్వ విభాగానికి ప్రజలు పత్రాల రూపంలో సమర్పించడమనేది ప్రస్తుత రోజుల్లో ఆమోదించదగిన చర్య కాదని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యారంగంలో అడ్మిషన్లకు, రిక్రూట్‌మెంట్ బోర్డులు పరిశీలించడానికి, వివిధ పథకాలకు అర్హత కోసం, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఒక వ్యక్తి తన సర్టిఫికెట్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్, ఇతర సర్టిఫికెట్లను ప్రభుత్వమే ప్రజలకు ఇస్తోంది. కావున, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సర్టిఫికెట్‌ను బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఇతర ప్రభుత్వ శాఖలు చూడగలిగే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది పూర్తిస్థాయిలో అమలవుతుందో లేదో పర్యవేక్షించే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు.
రైల్వేకు లాజిస్టిక్ పార్కులు అనుసంధానం: సీఎం
లాజిస్టిక్ పార్కులను రైల్వేకు అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇచ్ఛాపురం నుంచి చెన్నై వరకు రెండు వరుసల రైల్వే లైనును నాలుగు లైన్లకు విస్తరిస్తున్నారని తెలిపారు. రైల్వే వల్ల తక్కువ ఖర్చుతో రవాణా జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల్లో హెలిపోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్‌లో 16 లక్షల ప్యానెళ్లు జూన్ నాటికి బిగించాలన్నారు. కుసుమ్ రెండో దశ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఐ అండ్ ఐ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ... నాలుగు సీపోర్టులు అభివృద్ధిలో ఉన్నాయన్నారు. 93 జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో హెలిపోర్టు ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చిందని, దాన్ని కలెక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు.