పోలీసుల కొరత ఉండొద్దు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:09 AM
రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని.. నేరాల రేటు 6 శాతం మేర తగ్గిందని చెప్పారు.
నేరాల రేటు 6 శాతం తగ్గింది
ఆర్థిక నేరాలు, సైబర్ మోసాల కట్టడికి చర్యలు
శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు
మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్
రోడ్డు భద్రత నిబంధనలపై రాజీపడొద్దు: సీఎం
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని.. నేరాల రేటు 6 శాతం మేర తగ్గిందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. గురువారం కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్ క్రైం, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై అవగాహనకు విశాఖ పోలీసులు రూపొందించిన ప్రచార వీడియోలను సీఎం ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. నేరాల రేటు 6 శాతం తగ్గాయని.. అయితే ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు పెరిగాయని.. వీటి కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని స్పష్టంచేశారు. మహిళలపై నేరాలు తగ్గాయని.. అయితే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌడీషీటర్లను అదుపు చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. నెల్లూరులో రౌడీ ముఠాలను గుర్తించారని.. మిగతా జిల్లాల్లోనూ ఇలాంటి ముఠాలు ఉన్నాయేమో నిఘా పెట్టాలన్నారు. ‘డ్రగ్స్, గంజాయి గ్యాంగులను కట్టడి చేయంతో పాటు డీ-ఎడిక్షన్ కేంద్రాల ద్వారా మార్పు తీసుకురావాలి. గంజాయి, డ్రగ్స్ చాలా వరకు నియంత్రించారు... నిర్మూలన దిశగా అడుగులు వేయాలి’ అని స్పష్టంచేశారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే..
‘రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే.. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైంది ఏముంటుంది..? రోడ్డు భద్రత నిబంధనల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు’ అని సీఎం ఆదేశించారు.. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని స్పష్టం చేశారు. బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్ల కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీలతో పాటు రవాణా, రోడ్లు-భవనాలు, ఇతర శాఖల అధికారులు స్వయంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలించి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. 503 బ్లాక్ స్పాట్లను సరిచేయాలన్నారు.
బాణసంచా యూనిట్లలో నిరంతర తనిఖీలు
రాష్ట్రంలో బాణసంచా తయారీ యూనిట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ సమీపంలో ఇటీవల జరిగిన బాణసంచా దుర్ఘటనలు రాష్ట్రంలో ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాటు సమగ్రంగా తనిఖీలు చేపట్టి ప్రమాణాలు పాటించని వారిపై చర్య తీసుకోవాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఇళ్లలో బాణసంచా నిల్వ చేసినా ఉపేక్షించొద్దని, స్టోరేజ్ పాయింట్లను క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమిళనాడులోని శివకాశికి ఇటీవల వెళ్లొచ్చిన బృందం నివేదికలోని సిఫారసులను అమలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
అభివృద్ధి, శాంతి భద్రతల్లో జిల్లాల మధ్య పోటీ
అభివృద్ధి, శాంతి భద్రతల అంశాల్లో జిల్లాల మధ్య పోటీ పెడుతున్నామని సీఎం చెప్పారు. పోలీసులు పబ్లిక్ ఫ్రెండ్లీగా, రౌడీలకు సింహ స్వప్నంలా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం 4 సూచీల ఆధారంగా జిల్లాలకు రేటింగ్ ఇచ్చి, 4 విభాగాలుగా విభజించామని తెలిపారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాల జీఎ్‌సడీపీ వాటా పెరుగుదల, కీలక సూచీలను అప్‌డేట్ చేయడం, ప్రజాభిప్రాయం, నేరాల ధోరణి ఆధారంగా జిల్లాలను లీడర్స్, పర్‌ఫార్మర్స్, ఎమర్జింగ్, యాస్పిరేషనల్ అనే 4 విభాగాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. లీడర్స్ విభాగంలో ఎన్టీఆర్, కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, బాపట్ల, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం.. పర్‌ఫార్మర్స్ విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తూర్పుగోదావరి.. ఎమర్జింగ్ విభాగంలో విజయనగరం, నెల్లూరు, కడప, ప్రకాశం తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి.. యాస్పిరేషనల్ విభాగంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, కర్నూలు, పోలవరం, అన్నమయ్య, అంబేడ్కర్ కోనసీమ, మార్కాపురం జిల్లాలు ఉన్నాయని చెప్పారు.