విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి: సీఎం
ABN , Publish Date - May 01 , 2026 | 03:47 AM
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా వినూత్న కోర్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా వినూత్న కోర్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన జరగాలన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. యూనివర్సిటీలు ప్రస్తుతం అందిస్తున్న కోర్సులను పునర్నిర్మాణం చేయాలన్నారు. పరిశోధనలు, ఇన్నోవేషన్, స్టార్ట్‌పలను ప్రోత్సహించేలా మార్పులను అందిపుచ్చుకోవాలని సూచించారు. రాబోవు కాలంలో గేమ్ చేంజర్‌లు కానున్న లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై మొదటగా కోర్సు ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలోని వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-200 యూనివర్సిటీలతో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. యూనివర్సిటీల్లో విదేశీ భాషలను నేర్పేందుకు ఓ ప్రత్యేక విభాగం ఉండాలని సూచించారు.
విద్యార్థులకు అన్ని పోషకాలు అందాలి
విద్యార్థులకు అన్ని పోషకాలు అందేలా మధ్యాహ్న భోజన మెనూ రూపొందించాలని పాఠశాల విద్య అధికారులను సీఎం ఆదేశించారు. హాస్టళ్లు, గురుకులాల్లో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల హాజరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా అత్యుత్తమ టీచర్లతో వీడియోల ద్వారా పాఠాలు చెప్పిస్తే బోధనలో నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాంకేతికత సాయంతో ఉత్తమ విద్యను అందించాలన్నారు. విద్యార్థులు వైవిధ్యంగా ఆలోచించేలా వారితో ‘స్టూడెంట్స్ ఇన్నోవేషన్ కాంక్లేవ్’ పేరుతో ఒక ఏఐ సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. యువత ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఏ మేరకు నైపుణ్యాలు కలిగి ఉన్నారో ర్యాండమ్ స్కిల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలతో అనుసంధానం చేసుకుని, యువతకు అత్యుత్తమ నైపుణ్యాలను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీఎం సేతు ప్రాజెక్టు ద్వారా ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ విధానంలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
బడుల్లో సదుపాయాల కల్పనపై దృష్టి: లోకేశ్
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు చేస్తున్నామని మంత్రి లోకేశ్ సమావేశంలో సీఎంకు వివరించారు. ‘ఒక తరగతికి ఒక టీచర్’ పాఠశాలలను పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. పాఠ్యాంశాల్లో మార్పులతో పాటు బ్రిడ్జి కోర్సులు కూడా అమలు చేస్తున్నామన్నారు. బోధనా విధానాలపై అధ్యయనానికి ఉత్తమ టీచర్లను ఫిన్‌లాండ్‌కు పంపుతున్నామని చెప్పారు.