ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లడం తప్పు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:07 AM
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో పుట్టా మహేశ్ అంశం ప్రస్తావనకు వచ్చింది.
దానికి పార్టీ సమాధానం చెప్పాల్సి రావడం దురదృష్టకరం
క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై కఠినమైన నిర్ణయాలు: సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో పుట్టా మహేశ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో 2024 ఎన్నికల్లో చాలా మందికి సీట్లు ఇచ్చి చట్ట సభలకు పంపాం. కొందరు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మరికొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎంపీగా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అటువంటి పార్టీల కు వెళ్లడం తప్పు. ఏలూరు ఎంపీ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. మంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు కూడా తమకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా? తమ తప్పులు, అలవాట్ల వల్ల పార్టీకి నష్టం చేసే వాళ్లను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మోయబోదు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై అత్యంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తాం. టీడీపీలో నేతలు అంతా క్రమశిక్షణ, విలువలతో మెలగాలి. పార్టీ సిద్ధాంతాలు పాటించే విషయంలో ఎవరికీ వెసులుబాటు ఉండదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.