గిరిజన మిల్లెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించిన సీఎం
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:50 AM
‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
‘అరకు కౌని’ పేరుతో మిల్లెట్ మీల్ తయారీ
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గురువారం కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను ఆయన సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్లు, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతి, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి ఆహార ఉత్పత్తులను పరిశీలించి, రుచి చూశారు. గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ మిల్లెట్ ఆహారాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్ల మెనూలో ‘అరకు కౌని’ వంటకాలను చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ మీల్స్‌ను ప్రోత్సహించాలని అధికారులు కోరారు. మిల్లెట్ థాళీని పరిశీలించిన సీఎం.. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, మంత్రి సంధ్యారాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.