అమరావతిలో క్రియేటివ్ సిటీ
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:56 AM
రాష్ట్ర రాజధాని అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామన్నారు.
ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్‌లకు పెద్దపీట
గండికోట, కంభంచెరువు, పాపికొండలు పర్యాటక ప్రాంతాలు
వేసవి రిసార్ట్స్‌గా అరకు, లంబసింగి, పాడేరు
ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి పెట్టాలి.. కలెక్టర్లతో సీఎం
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతిలో క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహిస్తామన్నారు. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు క్రియేటివ్ సిటీలో పెద్దపీట వేస్తామని చెప్పారు. గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో పర్యాటక రంగంలో పెట్టుబడులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పర్యాటక రంగంలో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అందుకే టూరిజానికి పారిశ్రామిక హోదా కల్పించాం. మన రాష్ట్రంలో అనేక చారిత్రక ప్రాంతాలు, పురాతన కట్టడాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఐదారు పెద్ద దేవాలయాలు, మరో 21 ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ప్రజల్లో భక్తి కూడా పెరిగింది. తిరుపతి లడ్డూ వ్యవహారం తర్వాత దేవుడిని కాపాడుకోవాలనే కమిట్‌మెంట్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టాలి. 10 నుంచి 15 లక్షల జనాభా ఉన్న దుబాయ్‌లోనే టూరిస్టుల కోసం లక్ష గదులు అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో కనీసం 50 వేల రూములైనా కట్టాలి. కోనసీమలో హోం స్టే ఏర్పాట్లు చేసి ఈవెంట్లపై దృష్టి పెట్టాలి. యుద్ధ ప్రభావాల నేపథ్యంలో విదేశాల కంటే స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకే ఆదరణ పెరుగుతోంది. కాబట్టి రాష్ట్రంలో జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. సూర్యలంక బీచ్‌ను గోవా కంటే బాగా అభివృద్ధి చేయొచ్చు. గండికోట భారతదేశానికే గ్రాండ్ కాన్యన్. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు. పాపికొండలు, అఖండ గోదావరి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా, అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలను సమ్మర్ రిసార్ట్స్‌గా అభివృద్ధి చేయొచ్చు. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ ప్రాంతం మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుంది.
టూరిజం ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు అభివృద్ధి చేయడంతో పాటు మాన్యుమెంట్లను కూడా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా సూర్యలంక, గండికోట ప్రాజెక్టులను హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అభివృద్ధి చేయాలి. భవిష్యత్తులో నేషనల్ హైవేస్‌ను ఆనుకుని ఎలక్ట్రిక్ వాహనాల రీఛార్జింగ్ సెంటర్స్ వస్తాయి. వాటికి అనుబంధంగా టూరిజం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గేమింగ్ జోన్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు ఏర్పాటు చేయడానికి అంకూర్ మహేశ్వరి సంస్థ ముందుకు వచ్చిందని, అలాగే ఏరోస్ కూడా మన రాష్ట్రానికి వస్తోందని తెలిపారు.